MLA Kadiam Srihari : రాష్ట్రంలో సమగ్ర సర్వేకు అందరూ సహకరించాలి
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ( MLA Kadiam Srihari ) అన్నారు.
దిశ, జనగామ: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ( MLA Kadiam Srihari ) అన్నారు. వేలేరు మండల కేంద్రంలో పిఎసిఎస్ ( PACS ) ఆధ్వర్యంలో, ధర్మసాగర్ మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రలను శాసనసభ్యులు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ధాన్యం ఏ గ్రేడ్ రూ. 2,320, బీ గ్రేడ్ రూ. 2,300, సన్నరకానికి అదనంగా రూ. 500 బోనస్ చెల్లిస్తామన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వపరంగా రావాల్సిన సబ్సిడీలను అందించలేదని విమర్శించారు.
ఓ వైపు బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 23 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. డిసెంబర్ లో 31 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. కడియం శ్రీహరి మర్క్ కనిపించే విధంగా నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాన్నన్నారు. ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఎక్కడా కూడా కుల గణన జరగలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గానికి న్యాయం జరగాలనే అలోచనతో కుల గణన చేయాలని చారిత్రక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కుల గణన జరగబోతుందని పేర్కొన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి ఇలా అనేక రంగాల పై సర్వే జరుగుతుందని తెలియజేశారు. ఈ సర్వే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ వర్గాలకు చెందాలనే అంశాలు సర్వే ప్రకారం నిర్ధారణ చేయబడుతుందని తెలిపారు. ఈ సమగ్ర సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదకుమార్, డిసిఓ, ఎంపీడీవో, తహసీల్దార్, పిఎసిఎస్ డైరెక్టర్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.