రేవంత్‌కు వ‌ణుకు పుడుతోంది : మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌గా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.

Update: 2024-11-25 14:12 GMT

దిశ‌, మ‌హ‌బూబాబాద్ టౌన్ : కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌గా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ ధ‌ర్నాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… గిరిజనుల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే కేటీఆర్ మానుకోటకు వచ్చారని తెలిపారు. కేసీఆర్‌ పోడు భూములకు పట్టాలు ఇచ్చారని అన్నారు. మనం ధర్నా చేస్తుంటే రేవంత్‌ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు.

కేటీఆర్‌ బయటకు వస్తేనే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి మన భూములను గుంజుకుంటున్నాడని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కేసీఆర్‌ మన బిడ్డలకు సన్న బియ్యంతో భోజనం పెట్టారని అన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పురుగుల అన్నం పెడుతున్నారని మండిపడ్డారు. ఇది మన భూమి, భుక్తి కోసం జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు. పదేళ్ల పాల‌న‌లోనే తెలంగాణ‌ను అభివృద్ధిలో దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిపిన ఘ‌న‌త కేసీఆర్‌కు ద‌క్కుతుంద‌ని శాస‌న మండ‌లి బీఆర్ ఎస్ ప‌క్ష నేత మధుసూదనాచారి అన్నారు. పదేళ్లు కేసీఆర్‌ అద్భుతమైన పాలన కొనసాగించారని తెలిపారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తుందని విమర్శించారు.

కాంగ్రెస్‌ హయాంలో ప్రజలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ మహాధర్నాకు అడ్డుకునేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. రేవంత్‌ రెడ్డి భూములు లాక్కోవడమే పనిగా పనిచేస్తున్నారని అన్నారు. అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేయడమే మరో ఎజెండా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇది మానుకోట మాత్రమే కాదు.. మొత్తం తెలంగాణ గర్జన అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ మహాధర్నాతో కాంగ్రెస్‌ పాలకుల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. గిరిజన జాతి మొత్తం బీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.


Similar News