మ‌హాధ‌ర్నా స‌క్సెస్‌..ఉనికి చాటుకున్న బీఆర్ఎస్ నేత‌లు

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌ను నిరసిస్తూ బీఆర్ ఎస్ పార్టీ మ‌హ‌బూబాబాద్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నా స‌క్సెస్ అయింది

Update: 2024-11-25 12:55 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో/ మ‌హ‌బూబాబాద్ టౌన్ : ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌ను నిరసిస్తూ బీఆర్ ఎస్ పార్టీ మ‌హ‌బూబాబాద్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నా స‌క్సెస్ అయింది. మ‌హాధ‌ర్నాలో బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన‌డంతో.. ఆ పార్టీకి చెందిన ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా, ఖ‌మ్మం జిల్లాల‌కు చెందిన ముఖ్య నేత‌లంతా సోమ‌వారం ఉద‌యం మానుకోట‌కు చేరుకున్నారు. పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల త‌ర్వాత మానుకోట‌లో బీఆర్ ఎస్ పార్టీ సంద‌డి దాదాపుగా ఏమీ లేద‌నే చెప్పాలి. అడ‌ప ద‌డ‌పా నేత‌ల ప్రెస్‌మీట్లు జ‌రగ‌డం త‌ప్పా.. పార్టీ క్యాడ‌ర్‌ను ఆక్టివ్ చేసిన సంద‌ర్భమైతే క‌నిపించ‌లేదు. అయితే సోమ‌వారం నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నా ల‌క్ష్యం వేర‌యిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా మాత్రం ఆ పార్టీ శ్రేణులంతా ఒకే వేదిక‌ను పంచుకోవ‌డానికి.. నిన‌దించ‌డానికి మార్గంగా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కేటీఆర్ పాల్గొన‌డంతో హైప్‌..!

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో గిరిజ‌నుల‌పై ప్ర‌భుత్వం నియంతృత్వంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే చ‌ర్చ‌ను జ‌నంలోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్ర‌య‌త్నం చేస్తోంది. అందులో భాగంగానే సోమ‌వారం మ‌హ‌బూ బాబాద్‌లో నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నా.. జిల్లాల్లో నిర‌స‌న‌ల‌కు తొలి అడుగు మాత్ర‌మేనంటూ కేటీఆర్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. గిరిజ‌నుల చైత‌న్య ఖిల్లాగా ఉన్న మానుకోట‌ను బీఆర్ ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మ‌కంగా ఎంచుకున్న‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంట‌రీ సెగ్మెంట్ ప‌రిధిలోని మ‌హ‌బూబాబాద్‌, డోర్న‌క‌ల్‌, ఇల్లందు, మ‌ణుగూరు, ములుగు, భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఎస్టీ ప్రాబ‌ల్యంతో కూడుకున్న‌వే.ఈ నేప‌థ్యంలో మ‌హాధ‌ర్నాకు మ‌హ‌బూబాబాద్‌ను ఎంచుకుని..మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బీఆర్ ఎస్‌, ఎస్టీ ఉద్య‌మ సంఘాలు, ఉద్యోగ సంఘాల‌ను కూడా మ‌హాధ‌ర్నాకు ఆహ్వానించ‌డం గ‌మ‌నార్హం.

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డంతో పాటు.. గిరిజ‌నుల‌ను ఓన్ చేసుకునే విధంగా కేటీఆర్‌, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్ర‌సంగం కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం. ఈనేప‌థ్యంలో కేసీఆర్ హ‌యాంలో గిరిజ‌నుల‌కు ఒన‌గూరిన ప్ర‌యోజ‌నాల‌ను, తండాలను పంచాయ‌తీలుగా మార్చ‌డం వంటి అంశాల‌ను కేటీఆర్ గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. తొలుత ఈ నెల 21 నిర్వ‌హించ త‌ల‌పెట్టినా ఈ మ‌హాధ‌ర్నాకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించ‌డంతో బీఆర్ ఎస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. దీంతో ఈనెల 25న ధ‌ర్నాకు అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనేలా స్థానిక బీఆర్ ఎస్‌ జిల్లా నాయ‌క‌త్వం కృషి చేయ‌డంతో మ‌హాధ‌ర్నాకు హైప్ పెరిగి.. జిల్లా నేత‌ల అనుకున్న‌రాజ‌కీయ ల‌క్ష్యం కూడా నెరివేరింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ప‌హారా మ‌ధ్య మ‌హాధ‌ర్నా..!

మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో జ‌రిగిన బీఆర్ ఎస్ మ‌హాధ‌ర్నాపై పోలీసుల ప‌హారా కొన‌సాగింది. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌పై నిర్వ‌హిస్తున్న నిర‌స‌న కావ‌డంతో.. జిల్లా కేంద్రంలో రాజ‌కీయ అల‌ర్ల‌కు అవ‌కాశం ఉంటాయ‌ని భావించిన పోలీసులు పెద్ద ఎత్తున నిఘాను కొన‌సాగించారు. జిల్లా కేంద్రంలో వంద‌ల సంఖ్య‌లో పోలీసుల‌ను మొహ‌రించారు. ముఖ్య‌మైన కూడ‌ళ్ల‌న్నింటిలోనూ సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌హాధ‌ర్నాను ప‌ర్య‌వేక్షించారు. మ‌హాధ‌ర్నాకు మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇవ్వ‌డంతో కేటీఆర్ ధ‌ర్నా జ‌రిగే ప్రాంతానికి స‌రిగ్గా 12గంట‌ల‌కు చేరుకున్నారు. 25 నిముషాల పాటు ప్ర‌సంగించిన కేటీఆర్‌.. నిర్ణిత గ‌డువులోగానే ప్ర‌సంగాన్ని ముగించి హైద‌రాబాద్‌కు రోడ్డు మార్గంలో బ‌య‌ల్దేరి వెళ్లారు.


Similar News