చెక్కులకు చిక్కులు…కమిషనర్‌ సంతకం కోసం వెయిటింగ్‌

బల్దియాలో కాంట్రాక్టర్లకు సంబంధించిన చెక్కులు చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది.

Update: 2024-11-25 13:00 GMT

దిశ, వరంగల్‌ టౌన్ : బల్దియాలో కాంట్రాక్టర్లకు సంబంధించిన చెక్కులు చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. నగరంలో రూ.5లక్షల లోపు విలువ గల పలు పనులను కాంట్రాక్టర్లు చేపట్టగా, వాటి బిల్లులు ఇటీవలే సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఆ చెక్కులు కమిషనర్‌ సంతకం కోసం పది, పదిహేను రోజులుగా మూలుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల కిందట చేపట్టిన బిల్లులు, ఎట్టకేలకు సిద్ధమయ్యాయని సంతోషపడిన కాంట్రాక్టర్లకు కమిషనర్‌ సంతకం నిర్వేదం మిగుల్చుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం ఆ చెక్కులను కమిషనర్‌ సంతకం పేరిట బల్దియాకు చెందిన ఓ అధికారిని కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షకు రూ.5వేల చొప్పున డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము అప్పులు చేసి పనులు చేసి ఇప్పటికీ మిత్తీలు చెల్లిస్తున్నామని, ఇంకా కమీషన్లు ఇచ్చే పరిస్థితి లేదని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కాలయాపన చేయకుండా ఇప్పటికైనా కమిషనర్‌ చొరవ తీసుకుని తమ చెక్కులపై సంతకం చేసి తమకు న్యాయం చేయాలని పలువురు కాంట్రాక్టర్లు కోరుతున్నారు.


Similar News