దొరుకుతలేరా.. ఏనుమాముల భూకబ్జాదారుల పై చర్యల్లో జాప్యం..

భూ కబ్జాదారులు పోలీసులకే కొరకరాని కొయ్యగా మారిపోయారా ? వరంగల్‌ నగరం ఏనుమాముల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు నిజమేననిపిస్తోంది.

Update: 2023-04-12 16:39 GMT

దిశ, వరంగల్‌ టౌన్‌ : భూ కబ్జాదారులు పోలీసులకే కొరకరాని కొయ్యగా మారిపోయారా ? వరంగల్‌ నగరం ఏనుమాముల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు నిజమేననిపిస్తోంది. ఇటీవల ఏనుమాముల ప్రాంతంలో కొందరు తమభూములను అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. పైడిపల్లికి చెందిన బీఆర్‌ఎస్‌ నేత ఎల్లావుల కుమార్‌ యాదవ్‌, వరంగల్‌ బాలాజీనగర్‌, సుందరయ్యనగర్‌కు చెందిన తూర్పాటి రఘు, తూర్పాటి హరి, తూర్పాటి శ్రీనివాస్‌, జంగం రాజు, గండ్రాతి భాస్కర్‌ పై కేసులు నమోదయ్యాయి. అయితే, వీరిలో తూర్పాటి రఘు, తూర్పాటి హరి, తూర్పాటి శ్రీనివాస్‌ ఇప్పటివరకు పోలీసులకు దొరకలేదని తెలుస్తోంది. అయితే, వారు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నారా ? లేదా పోలీసులే వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా ? అనే సందేహాలు స్థానికులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిందితులంతా కాశిబుగ్గ, ఏనుమాముల చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది ప్లాట్లను, ఖాళీ స్థలాలను కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వీరిపై కేసులు పెట్టి నెల రోజులు దాటుతున్నా పోలీసులు వారి జాడ కనిపెట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది. పలురకాల కేసుల్లో గంటల వ్యవధిలో నిందితులను పట్టుకునే పోలీసులు, ఈ కేసుల్లో నిందితులను ఇంకా పట్టుకోకపోవడం పై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దొరకకుండా తిరుగుతున్న వారి వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్లే పోలీసులుచర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు వీరి వెనుక ఉండీ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ కేసులో పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటే నగరంలోని భూకబ్జాదారులందరి బాగోతాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు, గల్లీ లీడర్ల కనుసన్నల్లో జరుగుతున్న ఆక్రమణలు సైతం బయటపడతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

దొరుకుతలేరు.. పట్టుకుంటం : సీఐ

భూ కబ్జా పై నమోదైన కేసులో నిందితుల్లో కొందరు తప్పించుకుని తిరుగుతున్నారని ఏనుమాముల సీఐ మహేందర్‌ తెలిపారు. మరికొందరు ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. అయితే, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

Tags:    

Similar News