ఆకేరు వాగులో చీకటి దొంగలు..ఆగని ఇసుక దోపిడీ

ఉమ్మడి మండలాల శివారులో ఇసుక దోపిడీ ఆగడం లేదు.

Update: 2024-12-25 08:46 GMT

దిశ,డోర్నకల్: ఉమ్మడి మండలాల శివారులో ఇసుక దోపిడీ ఆగడం లేదు. ఎవరొచ్చినా ఏం చేస్తారనే ధీమాతో రెచ్చిపోతున్నారు. నిశీధిలో యథేచ్ఛగా ఇసుక కొల్లగొడుతున్నారు.అక్రమార్కుల దోపిడీకి కళ్లెం వేయాల్సిన అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజలనుకుంటున్నారు.

ఆకేరులో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది..

వాస్తవానికి మోదుగడ్డ తండా,ములకలపల్లి శివారులోని ఆకేరు వాగుకు వెళ్తే అక్కడేం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. డొంక దారి వేసి ఇసుకను తోడిన ఆనవాళ్లు కనబడుతూనే ఉన్నాయి.అయినా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిశీధిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారుల వివరణ అడిగితే.. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది.అక్రమార్కుల ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయుటకు చర్యలు తీసుకుంటున్నాం.స్థానిక పోలీసుల సహకారంతో ఇసుక దోపిడీని అరికడతామని అంటున్నారు.బుధవారం తెల్లవారుజామున సైతం నాలుగు గంటలకు పైగా అక్రమార్కులు ఇసుక తవ్వకాలకు పాల్పడినట్టు సమాచారం!

స్పందించని అధికారులు..!

ములకలపల్లి శివారులోని ఆకేరు వాగు నుంచి అర్ధరాత్రి ఇసుక తరలింపు వ్యవహారం జోరుగా సాగుతోంది.రాత్రి 10 దాటిన తర్వాత ట్రాక్టర్లు వాగులోకి చొరబడుతున్నాయి. తెల్లవారుజాము వరకూ పదుల ట్రిప్పుల ఇసుకను తరలించుకుపోతున్నారు. మాకు ఎదురే లేదంటూ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.ఇసుక అక్రమ తవ్వకాలపై ఈ నెల 22న తవ్వుకో తరలించుకో! శీర్షికను దిశ దినపత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది.అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.


Similar News