గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి : మంత్రి సీతక్క
గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని
దిశ,కొత్తగూడ : గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ప్రపంచంతో పోటీపడే విద్యను అందించాలని మంత్రి సీతక్క ఉపాధ్యాయులకు సూచించారు. సీతక్క బుధవారం రాత్రి కొత్తగూడ మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గాంధీనగర్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలోని ఆకస్మికంగా తనిఖీ చేసి పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి బోధన ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలోని తరగతి గదులు, డార్మెటరీ హాల్ ను ప్రత్యేకంగా పరిశీలించారు. రాత్రి మొత్తం విద్యార్థులతో సంస్కృతి కార్యక్రమాలతో ఆట పాటలతో విద్యార్థులతో డాన్సులు నిర్వహించి వారితో రాత్రి మొత్తం విద్యార్థులతో గడిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..గురుకుల విద్యార్థులకు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆడపిల్లలకు మంచి డైట్ ఇవ్వాలి, కానీ గత ప్రభుత్వం వారికి ఇవ్వలేదన్నారు. దీంతో బాలికలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయాలు తీసుకొని 16 సంవత్సరాలుగా పెరగని డైట్ చార్జీలను, కాస్మెటిక్ చార్జీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అందించే భోజనంలో నూతన మెనూ ప్రకారం ఉండేలా మెనును రూపొందించినట్లు మంత్రి తెలిపారు. మెనూ ప్రకారం తప్పనిసరి భోజనాలు అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం.. రుచికరమైన భోజనం, అల్పాహారం అందించాలన్నారు. వార్డెన్లు రాత్రిళ్లు హాస్టళ్లలోనే బస చేయాలని మంత్రి తెలిపారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను సందర్శిస్తూ.. కింది స్థాయి సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.అనంతరం విద్యార్థులు మంత్రి సీతక్కతో ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ,ఎంపీపీ విజయ రూప్ సింగ్, జడ్పీటీసీలు పులసం పుష్పలత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి,సుంకరబోయి మొగలి, గురుకుల ప్రిన్సిపాల్ కల్పన,ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.