నరక ప్రయాణం.. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చిన కాంట్రాక్టర్
గత ఏడాది దుగ్గొండి నుంచి గిర్నిబావి వరకు సుమారుగా రూ.15 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించారు.
దిశ, దుగ్గొండి : గత ఏడాది దుగ్గొండి నుంచి గిర్నిబావి వరకు సుమారుగా రూ.15 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మించి ఇరువైపులా మట్టి పోయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద సూచిక బోర్డులు, క్రాసింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కల్వర్టులు సైతం అసంపూర్తిగా ఇష్టరిత్తిన నిర్మించడంతో పంటచేన్లలో వర్షపు నీరు చేరి పంటలు దెబ్బతింటున్నాయి. ఉన్న చోట కాకుండా వేరే చోట కల్వర్టు నిర్మిచడంతో తొగర్రాయి తుమ్మల చెరువులోకి నీరు వెళ్లకుండా కాలువ ఆగిపోయిందని రైతులు గ్రీవెన్స్ ద్వారా కలెక్టర్ వద్ద మొర పెట్టుకున్న దాఖలాలు లేకపోలేదు. వెంకటాపురం వద్ద మక్కల లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు దిగేసరికి వాహనం బోల్తా కొట్టి డ్రైవర్ కు ప్రాణాపాయం తప్పింది. మండలానికి చెందిన మాజీ జిల్లా ప్రజాప్రతినిధి ఎదురురుగా వస్తున్న బస్సును తప్పించబోయి వాహనాన్ని కిందికి దింపాడు. అయితే రోడ్డుకు సమాంతరం మట్టి పోయకపోవడంతో వాహనం పూర్తిగా దెబ్బతింది. ప్రతిరోజు వాహన దారులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు.
రోడ్డు వేసి.. మట్టి మరిచి...
మండల కేంద్రం నుంచి గిర్నిబావికి వెళ్లే ప్రధాన రహదారి కోట్ల రూపాయలు వెచ్చించి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించారు. కానీ కాంట్రాక్టర్ ఆ రోడ్డుకు ఇరువైపులా మట్టిని వేయించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీట్ ఎత్తులో రోడ్డు ఉండటంతో రోడ్డు దిగటానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేసి ఆరునెలలు పైగా అవుతున్నా మట్టిని వేయకపోవడంతో ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్ తో రోడ్డుకు ఇరువైపులా మట్టి వేయించాలని కోరుతున్నారు.
ఎండిన చెట్లతో పొంచి ఉన్న ప్రమాదం..
ప్రధాన రహదారి వెంట ఉన్న ఎండిన చెట్లతో ప్రమాదం పొంచి ఉంది. రోడ్డు పై ప్రయాణం చేసే ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియక భయానికి లోనవుఉన్నారు. గతంలో ఎండిన చెట్లు రోడ్డు పై కూలి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి.
అంటీ ముట్టనట్టుగా ఆర్ అండ్ బీ అధికారులు
నిత్యం రద్దీగా ఉండే రహదారి అసంపూర్తిగా ఉండి పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నా ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. మూలమలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోగా, అసంపూర్తిగా కల్వర్టుల నిర్మాణం జరిగినా చూసీ చూడనట్టు వ్యవహారిస్తుండటంతో సదరు కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ అండ్ బీ ఏఈ సతీష్ ను చరవాణి ద్వారా సంప్రదించగా కాంట్రాక్టర్ చేత మట్టి పోయిస్తామని, సూచిక బోర్డులను ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇదే విషయమై డీఈ రమాదేవిని వివరణ కోరడానికి ఫోన్ చేయగా ప్రభుత్వం కేటాయించిన ఫోన్ నెంబర్ స్విచ్ఆఫ్ ఉండటం గమనార్హం.
మట్టి పోసి ప్రమాదాలను నివారించాలి.. సుకినె నాగరాజు, శివాజీనగర్ గ్రామం,
రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ ఇరువైపుల మట్టి పోయకపోవడంతో ప్రమదాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మా స్వంత ఖర్చులతో కొంత మేర మట్టి పోసుకున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్ చేత గ్రామంలో నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్డుకు ఇరువైపుల మట్టి పోయిస్తే జరిగే ప్రమాదాలను నివారించవచ్చు.
ఎండిన చెట్లను తొలగించాలి.. బండారి ప్రకాష్, బిక్కాజిపల్లి గ్రామం,
దుగ్గొండి నుంచి గిర్నిబావి వెళ్లే ప్రధాన రహదారి వెంట బీసీ కాలనీ, శివాజీనగర్, తొగర్రాయిల వద్ద ఎండిన చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. చెట్లు కూలి రోడ్డు పై పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తక్షణమే అధికారులు ఎండిన చెట్లను తొలగించాలి. అసంపూర్తిగా నిర్మించిన కల్వర్ట్ లను పూర్తి స్థాయిలో నిర్మించాలి. రోడ్డు వెంట సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి.