ఆ ఏఓ రూటే సపరేటు.. కార్యాలయానికి రాడు త‌నిఖీల‌కు పోడు

Update: 2023-05-25 02:51 GMT

దిశ, హ‌న్మకొండటౌన్: హ‌న్మకొండ జిల్లా ప‌ర‌కాల డివిజ‌న్ ప‌రిధిలోని ఓ ఏఓ ప‌నితీరుపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల‌కు అందుబాటులో ఉంటూ వారికి స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేయాల్సిన అధికారి వారానికోసారి కార్యాల‌యం ముఖం చూస్తున్నట్లు స‌మాచారం. రైతులు ఎప్పుడు కార్యాల‌యానికి వెళ్లినా సార్ లేర‌నే స‌మాధాన‌మే సిబ్బంది నోట వినిపిస్తోంది. ఎంచ‌క్కా సొంత వ్యవ‌హారాలు చూసుకుంటూ విధుల‌కు ఎగ‌నామం పెడుతున్నట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

కార్యాల‌యానికి రాకుండానే కిందిస్థాయి సిబ్బందితోనే ప‌నంతా చేపిస్తుండ‌డం సార్ నైపుణ్యానికి నిద‌ర్శన‌ంగా నిలుస్తోంది. రూ.వేల్లో జీతం తీసుకుంటూ రైతులు కాల్ చేసినా స్పందించ‌లేనంత‌, కార్యాల‌యానికి వెళ్లినా దొర‌క‌నంత బిజీగా సొంత వ్యవ‌హారాల్లో మునిగిపోతున్నా స‌ద‌రు అధికారిపై ఉన్నతాధికారుల ప‌ర్యవేక్ష‌ణ లేక‌పోవ‌డం విస్తుగొల్పుతోంది.

సీజ‌న్‌లో మాముళ్లే..

2018లో బ‌దిలీపై ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ మండ‌లానికి ఏవోగా బ‌దిలీపై వ‌చ్చారు. ఐదేళ్లుగా సీటుకు అతుక్కుపోయిన ఆయన అందిన‌కాడికి దండుకునే విధానాన్ని అవ‌లంభిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దండుకోవ‌డంలో భాగంగానే మండలంలో ఫర్టిలైజర్ షాపులు అనుమ‌తులు లేకుండా న‌డుస్తున్నా మాములుగానే వ‌దిలేస్తున్నట్లు స‌మాచారం. ఇక పర్మిషన్, లైసెన్స్ కోసం స‌ద‌రు అధికారి నుంచి ఫైల్ క్లియ‌ర్ కావ‌డానికి రూ.10వేలు మినిమం ఉంటే కానీ ముందుకు కదలదని స‌మాచారం. లైసెన్స్ రెన్యువ‌ల్ విష‌యంలోనూ షాపుల య‌జ‌మానుల‌ను జ‌ల‌గాల పీడిస్తున్నట్లు వ్యాపారుల ద్వారా తెలుస్తోంది.

ఇక మాముళ్లు అంద‌జేసిన వ్యాపారుల షాపుల వైపు పొర‌పాటున కూడా క‌న్నెత్తి చూడ‌కుండా ఆయ‌న మాముళ్ల పుచ్చుకున్న నిజాయితీని చాటుకుంటుండ‌డం విశేషం. స‌ద‌రు అధికారిపై ఇప్పటికే ఉన్నతాధికారుల‌కు ఫిర్యాదులు చేరినా ఎందుక‌నో పట్టింపులేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంపై అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. అధికారి పాపంలో వారికి భాగ‌స్వామ్యం ఉందా..? అన్న అనుమానాలూ వ్యక్తమ‌వుతున్నాయి. అధికారి అక్రమాల‌ను ఇప్పటికైనా ఉన్నతాధికారులు క‌ట్టడి చేస్తారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News