క్రైం రేటు స్వల్పంగా పెరిగింది

గత సంవత్సరంతో పోల్చితే భూపాలపల్లి జిల్లాలో క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందని ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే తెలిపారు.

Update: 2024-12-30 13:46 GMT

దిశ, వరంగల్ బ్యూరో : గత సంవత్సరంతో పోల్చితే భూపాలపల్లి జిల్లాలో క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందని ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్రైం రిపోర్ట్ ను వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 2024 సంవత్సరం లో జరిగిన నేరాలు, నిందితులకు పడిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, నేరాల నియంత్రణ కు తీసుకొన్న ప్రత్యేక చర్యలు తదితర అంశాలను మీడియాకు వివరించారు. సమాజంలో శాంతిని నెలకొల్పడం లో, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నేరాలను నివారించడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు.

గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తో పాటు, 2024 సంవత్సరంలో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ పార్లమెంటు ఎన్నికలు, వీవీఐపీ, ఇతర విఐపి ల పర్యటనలు, వివిధ పండుగల సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరంలో జిల్లా పరిధిలో 3062 కేసులు నమోదవ్వగా, ఈ సంవత్సరం డిసెంబర్ 27 వరకు 3306 కేసులు నమోదైనట్లు తెలిపారు.

వివిధ రకాల నివారణా చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారించగలిగామని, ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి, డ్రంకన్ డ్రైవ్ లను గణనీయంగా తగ్గించామని, నేరాలకు పాల్పడకుండా నియంత్రిస్తూ, ప్రజలకు భరోసా కల్పించామని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, భరోసా సెంటర్ల ఏర్పాటు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లపై పాఠశాల, కళాశాలల, మెడికల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, భరోసాను నింపామని పేర్కొన్నారు. ఇంతేకాక గ్రామాల్లో, పట్టణాల్లో దొంగతనాలు నివారణ కోసం సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరించామని, డ్రగ్స్, గoజాయిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, డీఎస్పీ నారాయణ నాయక్, డీసీ ఆర్ బీ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.


Similar News