అవినీతి పరులకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
దిశ, హన్మకొండ: దేశంలో అవినీతి పరులకు ప్రధాని నరేంద్ర మోడీ కొమ్ము కాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం హనుమకొండ లోని హరితా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో సుమారు 150 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న చిన్న కుంభకోణాలకే ప్రభుత్వాలు కూలిపోయాయని, నేడు లక్షల కోట్ల అవినీతి జరిగినా పట్టింపు లేదని అన్నారు.
'బీజేపీ కో హఠావో.. దేశ్ కి బచావో' పేరుతో ఏప్రిల్ 14 నుంచి మే 18 వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో సీపీఐ ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. జూన్ 1 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, బి. విజయ సారథి, సిహెచ్ రాజారెడ్డి, కె. రాజ్ కుమార్, తోట మల్లికార్జున రావు, నాయకులు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి, మండ సదా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.