ఝాన్సీ చేరికతో పైచేయి..పాలకుర్తిలో పెరిగిన కాంగ్రెస్ బలం
ప్రముఖ ఎన్ఆర్ఐ దంపతులు హనుమాండ్ల రాజేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరడంతో పాలకుర్తిలో అనుహ్యంగా హస్తం బలం పెరిగింది. హనుమాండ్ల దంపతులు పాలకుర్తి సెగ్మెంట్ లో ముఖ్యంగా తొర్రూరు మండలంలో పలు
దిశ, వరంగల్ బ్యూరో/పెద్దవంగర : ప్రముఖ ఎన్ఆర్ఐ దంపతులు హనుమాండ్ల రాజేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరడంతో పాలకుర్తిలో అనుహ్యంగా హస్తం బలం పెరిగింది. హనుమాండ్ల దంపతులు పాలకుర్తి సెగ్మెంట్ లో ముఖ్యంగా తొర్రూరు మండలంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు సుపరిచితులు. తొర్రూరు మండలం చెర్లపాలెం వాసి ఝాన్సీని కాంగ్రెస్ నుంచి బరిలోకి దింపేందుకు టీ పీసీసీ చీఫ్ పక్కాగా స్కెచ్ వేశారు. దీంతో బలమైన అభ్యర్థి వచ్చారనే ఉత్సాహంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. పాలకుర్తిలో కాంగ్రెస్ బలోపేతానికి చేరికలను ప్రోత్సహించే పనిలోనూ టీ పీసీసీ నాయకత్వం ఉంది. బీఆర్ఎస్ లో అసంతృప్తి, అసమ్మతి ముఖ్య నేతలపైనా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే యతి రాజారావు కొడుకు ఎన్ సుధాకర్‌రావును, ఆయన కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
నెమరుగొమ్ముల సోదరులపై గురి
ఉమ్మడి రాష్ట్రంలో చెన్నూరు నుంచి నెమరు గొమ్ముల యతి రాజారావు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసి తిరుగులేని నాయకుడిగా పేరు గడించారు. ఆయన తర్వాత కొడుకులు డాక్టర్ సుధాకర్ రావు ఒకసారి ఎమ్యెల్యేగా, ప్రవీణ్ రావు జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ నుంచి దుగ్యాల శ్రీనివాస్ గెలిచారు. సుధాకర్ రావు ఓటమి చెందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దుగ్యాల ఆ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో సుధాకర్ రావు టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎర్రబెల్లి, కాంగ్రెస్ నుంచి దుగ్యాల, టీఆర్ఎస్ నుంచి సుధాకర్ రావులు పోటీ చేశారు. ఎర్రబెల్లి గెలిచి కొంతకాలం తర్వాత కారెక్కారు. ప్రస్తుతం సుధాకర్‌రావుకు పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం, ప్రభుత్వంలో ఎలాంటి పదవి దక్కకపోవడంతో కొంతకాలంగా పార్టీకి అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు. హనుమాండ్ల దంపతులతోనూ సుధాకర్‌రావు సోదరులకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఝాన్సీరెడ్డికి వీరిద్దరి మద్దతు ఉంటుందనే రాజకీయ చర్చ జరుగుతుంది. సుధాకర్ రావు సోదరులను కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అదే జరిగితే సెగ్మెంట్ లో హస్తం బలం మరింత పెరగడం ఖాయం. నెమరుగొమ్ముల సోదరులను పార్టీలోకి తీసుకురావడంలోనూ హస్తం అధినాయకత్వం సక్సెస్ అవుతుందా..? లేదా అనేది వేచి చూడాలి.