అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయండి: కలెక్టర్ శశాంక
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కొరకు కోట్లలో నిధులు మంజూరు చేస్తున్నదని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా కృషి చేయాలని కలెక్టర్ శశాంక కోరారు.
దిశ, మహబూబాబాద్ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కొరకు కోట్లలో నిధులు మంజూరు చేస్తున్నదని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా కృషి చేయాలని కలెక్టర్ శశాంక కోరారు. బుధవారం సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో మహబూబాబాద్ నియోజకవర్గస్థాయిలో2014సంవత్సరం నుంచి వివిధ శాఖలైన నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, విద్య వైద్యం, గిరిజన సంక్షేమం వంటి ప్రధాన శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతిపై శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ అధ్యక్షతన కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగి పంటకు నీరు అందే విధంగా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. నియోజకవర్గంలో డీవీఎం 48 ద్వారా ఎస్ఆర్ఎస్ పీ కాలువల నుంచి వచ్చే నీటితో 60 వేల ఎకరాలు సాగవుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 95% ఆయకట్టుకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గంలో 346 చెరువులు, 9 చెక్ డ్యాంలు ఉన్నాయన్నారు.నీరందని ప్రాంతాలలో ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగు కారణాలపై నివేదిక ఇవ్వాలన్నారు. సాగునీరు సరఫరా కాకుండా కాలువలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు
సాగునీరు చివరి రైతుల భూములకు అందే విధంగా రైతులందరూ సమన్వయంతో సహకరించుకోవాలని సూచించారు. గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్ తదితర మండలాల పరిధిలో నిర్మిస్తున్న రహదారులు, బ్రిడ్జిల నిర్మాణ పనులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేసి నివేదిక అందించాలన్నారు. సమస్యలుంటే పరిష్కరించుకోవాలి గాని జాప్యం చేయడం తగదన్నారు. రోడ్లు భవనాల శాఖ పనితీరుపై సమీక్షిస్తూ మార్చినెలాఖరులోగా రహదారుల పనులు పూర్తిచేసి నివేదికలను అందించాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిల పునర్నిర్మణానికి ప్రతి పాదనలు రూపొందించాలన్నారు. శాఖ పరిధిలో నిర్మాణం తలపెట్టిన సబ్ సెంటర్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన సబ్ సెంటర్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు.
మన ఊరు మనబడి మన బస్తి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, నిధులు ఉన్నందున పనులను త్వరితగతిన పూర్తి చేసి బిల్లుల చెల్లింపులకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే అక్షరాస్యత తక్కువ అని అందులో మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా విద్యలో అత్యంత వెనకబడి ఉందన్నారు. నియోజకవర్గంలో 60 సబ్ సెంటర్లు నిర్మించడం జరిగిందని జిల్లాలో కొత్తగా 74 మంజూరు కాగా, అందులో 26 నియోజకవర్గంలోనే నిర్మించినట్లు తెలిపారు. ఒక్కొక్క సబ్ సెంటర్ ను రూ.16 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ఆసుపత్రులలో రేడియాలజీ డయాగ్నస్టిక్ హబ్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో వైద్య సేవలను ఉచితంగా నిరుపేదలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ. 5 లక్షల నిధులు అభివృద్ధి కొరకు వెచ్చించినట్లు తెలిపారు. సీసీ రోడ్డు కమ్యూనిటీ హాల్ వంటి శాశ్వత పనులు చేపడితేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. తన నియోజకవర్గంలో 33గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కాగా ఒక్కొక్క భవనాన్ని రూ. 20 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇంటికన్నె, పెనుగొండ, అర్బన్ పల్లి గ్రామాల ప్రజలు వట్టేరు వాగు నీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్, ఇంజనీరింగ్ అధికారులు వెంకటేశ్వరరావు, నారాయణ తానేశ్వర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.