BRS లో భగ్గుమన్న వర్గ విబేధాలు.. MLC Kavitha ఎదుటే పోటాపోటీగా నినాదాలు! (వీడియో)
భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్‌లో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. భూపాలపల్లిలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం ప్రారంభోత్సవానికి మంగళవారం ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు.
దిశ, వరంగల్ బ్యూరో: భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్‌లో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. భూపాలపల్లిలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం ప్రారంభోత్సవానికి మంగళవారం ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. సందర్భంగా ప్రారంభోత్సవంలో శిలాఫలకంపై ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేరు లేకపోవడంపై ఆయన వర్గీయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
ఎమ్మెల్యే ప్రొద్బలంతోనే శిలాఫలకంపై ఎమ్మెల్సీ చారి పేరును చేర్చలేదని పేర్కొంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా, చారి అనుకూలంగా నినాదాలు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే గండ్ర అనుచరులు ఆయనకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో కొద్ది నిముషాల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గీయులు బల ప్రదర్శనకు దిగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ మొత్తం రాజకీయ గలాటా అంతా కూడా ఎమ్మెల్సీ కవిత ముందే జరగడం గమనార్హం. ఈ పరిణామాలపై కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ముగిసేంత వరకు కూడా వర్గపోరు, ఉద్రిక్తత కనిపించడం విశేషం.
సెగ రేపిన ఇటీవలి పరిణామాలు..
గడిచిన కొంతకాలంగా ఎమ్మెల్సీ చారి వర్గం భూపాలపల్లి నియోజకవర్గంలో చాలా ఆక్టివ్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని కూడా తనకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద చెప్పుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా భూపాలపల్లి నా అడ్డా.. టికెట్ విషయంలో ఎలాంటి సందేహం లేదని అనుచరుల వద్ద ఆత్మ విశ్వాసంతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే భూపాలపల్లిలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీలో స్పష్టమైన చీలిక ఉంది. అసలే పార్టీకి జిల్లాలో ఎదురుగాలి వీస్తోందని సర్వేలు వీస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న వేళ తాజా పరిణామాలు పుండు మీద కారం జల్లినట్లుగా ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : కేసీఆర్‌కు ఇదే చివరి అసెంబ్లీ.. సీఎంగా మళ్లీ కనబడరు: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు