ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి నిర్మాణం.. తెలంగాణలోనే ఎక్కడో తెలుసా..?

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో నిర్మించిన క్రీస్తు జ్యోతి ప్రార్ధనా మందిరాన్ని నిర్వాహకులు సంగాల

Update: 2023-05-04 07:26 GMT

దిశ, వేలేరు(ధర్మసాగర్): హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో నిర్మించిన క్రీస్తు జ్యోతి ప్రార్ధనా మందిరాన్ని నిర్వాహకులు సంగాల పాల్సన్ రాజు, గోపు జయప్రకాష్‌ల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రారంభించారు. క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ప్రారంభానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు రావడంతో ఉదయం నుండే కరుణాపురం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా అవతరించనుంది.

2018 జూన్ 11న ఈ మందిరానికి పునాది రాయి వేశారు. రెండంతస్తుల్లో హాల్‌ను రూపొందించారు. చర్చి ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా మొత్తంగా 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. ఇప్పటివరకు ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నాగాలాండ్ రాష్ట్రంలోని జాన్ హెబోటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చి ఉండగా ఇకపై ఈ రికార్డును క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం తిరగరాసింది.

చర్చి ప్రత్యేకతలు...

◆చర్చిపై భాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని (డోమ్) అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.

◆ ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం కొనుగోలు చేశారు.

◆ మందిరం లోపల రీసౌండ్ రాకుండా సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ అద్దారు.

◆ భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు.

◆ప్రార్థనామందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ వేశారు

◆ పిల్లర్ల నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీ వాడారు. చర్చి భవనం చుట్టూ ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని అద్దాల చిత్రాపటాలతో రూపొందించారు.

◆ ఎల్ఈడీ స్క్రీన్స్ తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.చుట్టూ దీపస్తంభాలు, ఇంకుడు గుంతలు నిర్మించారు.

◆ భవనం శంకుస్థాపనలో జెరూసలెం నుంచి మట్టి, బైబిల్లో పేర్కొన్న విధంగా వజ్రాలు, రాళ్లు వేశారు. చర్చి చుట్టూ ఆలివ్ (ఏసు క్రీస్తు ప్రార్ధనలు ఈ అలివ్ చెట్ల మధ్యనే ప్రార్ధనలు చేసేవారు) చెట్లు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News