రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పాలన కొనసాగుతుంది : మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టకపోగా పేదల ఇల్లు

Update: 2024-10-14 15:06 GMT

దిశ,గీసుగొండ: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టకపోగా పేదల ఇల్లు కూలుస్తుందని కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి,బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 16 వ డివిజన్ ధర్మారం లోని వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కొత్త కమిటీలను వేస్తామని ఈ ప్రక్రియలో ఒక సంవత్సరం ఆలస్యంగా నమోదు కార్యక్రమం చేపట్టాం ఇప్పటివరకు 15 లక్షల సభ్యత్వాలను నమోదు చేశామన్నారు. ఇంకో రెండు నెలలు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తి అవుతుందని కానీ కాంగ్రెస్ ప్రకటించిన ఏ ఒక్క పథకం ఆచరణకు రాలేదని విమర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్పా,ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు.

రైతుబంధు పేరు మార్చారు కానీ ఏ బంధు పడలేదని,మహిళ లకు ప్రతి నెల 2500 అకౌంట్లో వేస్తామని ఇంతవరకు ఆ పథకాన్ని అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా కొనసాగుతుంది.మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అధోగతి పాలు చేశాడని,ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనను కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. తలా తోక లేని మాటలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా పరిపాలిస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వరంగల్ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ధర్మారావు,మాజీ ఎంపీ సీతారాం నాయక్,మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్,ఎడ్ల అశోక్ రెడ్డి,చందుపట్ల కీర్తి రెడ్డి, పరకాల శాసనసభ అభ్యర్థి కాళీ ప్రసాద్,పెసరు విజయ చందర్ రెడ్డి,గోగుల రాణా ప్రతాప్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Similar News