కేంద్ర సంక్షేమ పథకాలు చిట్టచివరి వ్యక్తికి కూడా అందించాలి : బండి సంజయ్
మారుమూల వెనకబడిన ప్రాంతాల నిరుపేదల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని
దిశ, ములుగు ప్రతినిధి: మారుమూల వెనకబడిన ప్రాంతాల నిరుపేదల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని, 2028 సంవత్సరం నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ మూడో స్థానంలో ఉండే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా పర్యటన లో భాగంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పి శబరిష్, ఐటిడిఏ పి. ఓ. చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీఓ ఎన్. వెంకటేష్ లు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ కుమార్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అక్కడ నుండి బయలు దేరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి బండి సంజయ్ కుమార్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమం పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధిని వివరించి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, రామప్ప గురించి వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జిల్లాలో ఉన్న వెనుకబడిన మండలం కన్నాయిగూడెంలో నీతి సూచికలను జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన సంపూర్ణత అభియన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నీతి అయోగ్ జిల్లాలో సూచించిన ఆరు ఇండికేటర్లను, మండలంలో సూచించిన ఇండికేటర్ లను పురోగతి వాటి అమలులో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారులకు అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ దేశ సమగ్ర అభివృద్ధి కోసం సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. 2018 సంవత్సరంలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉండేదని ప్రస్తుతం ఐదవ స్థానానికి చేరిందని, 2028 సంవత్సరానికి మూడవ స్థానానికి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ద్వారా సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి చేపట్టడం జరిగిందని తెలిపారు. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగిందని తెలిపారు.
సంపూర్ణత అభియాన్ లో భాగంగా ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాలలో కనీస అవసరాలు విద్య, వైద్యం, ఆరోగ్యం , పారిశుద్ధ్యం అంశాలలో అభివృద్ధికి మొదటగా 2018 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ప్రామాణికంగా తీసుకొని అమలు చేయడం జరిగినదని తెలిపారు. తదుపరి 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 500 ప్రత్యేక బ్లాక్ లను గుర్తించి ఆ ప్రాంతాలలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 బ్లాక్ లను ఎంచుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలాన్ని ఎంచుకోవడం జరిగిందని, ఆరు ప్రామాణిక అంశాలుగా తీసుకొని లక్ష్యాన్ని ఏ మేరకు చేరుకోవడంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తుతున్నాయి తదితర అంశాలను తెలుసుకోవడం కోసమే ఈరోజు ములుగు జిల్లాకు రావడం జరిగిందని పేర్కొన్నారు.
సంపూర్ణత అభియాన్ కార్యక్రమంపై పూర్తిస్థాయిలో అందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. మళ్ళీ త్వరలోనే సంపూర్ణత అభియాన్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ప్రాంతం మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. అనంతరం వెంకటాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామం నంది పహాడ్ గుత్తి కాయ గూడెంలో సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి చేయబడిన స్వచ్ఛమైన తాగునీటి కోసం బోర్‌వెల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ టాయిలెట్లు, కమ్యూనిటీ షెడ్, కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేంద్ర హోం వ్యవహారాల శాఖ పి.ఎస్. ఆంధ్ర వంశీ ఐఏఎస్ ,
జిల్లా కలెక్టర్ దివాకర, ఐటిడిఏ పి. ఓ. చిత్ర మిశ్రా లతో కలిసి పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్న పిల్లలకు అన్న ప్రసన, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం,విద్యార్థులకు అక్షరాభ్యాసం చేశారు. కేంద్ర మంత్రి ప్రజలతో సూచిక అమలు వివరాలను తెలుసుకున్నారు. 12 సూచికలైన విద్య, వైద్యం, వ్యవసాయం పౌష్టికాహారం, సామాజిక అభివృద్ధి రంగలో లో భాగంగా ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, ప్రతి సెకండరీ పాఠశాలలో విద్యుత్ కనెక్షన్, వైద్యం లో గర్భిణీ నమోదు మొదటి మూడు నెలలలో బిపి, డయాబెటిస్ స్క్రీనింగ్, చిన్న పిల్లల టీకాల విషయం గురించి ఆరా తీశారు. వ్యవసాయ రంగంలో రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ పంపిణీ, సామాజిక అభివృద్ధిలో ప్రతి మహిళా సంఘానికి లోన్ల పంపిణీ, జిల్లా, మండలము పౌష్టికాహారంలో ఐసీడీఎస్ నమోదైన
ప్రతి గర్భిణీ పౌష్టికాహారం అందించాలని సంపూర్ణత అభియాన్ ముఖ్య ఉద్దేశం, ప్రతి చిట్టచివర ఉన్న అభివృద్ధికి దూరంగా ఉన్నా ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని నీతి ఆయోగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం గురించి ఆరా తీశారు. సంపూర్ణత ముఖ్య ఉద్దేశం 100% నీతి ఆయోగ్ సూచించిన ఇండికేటర్లను ప్రతి చివరి వ్యక్తికి అందేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. లింగాపూర్ గ్రామంలో రైతులతో, మహిళా స్వయం సంఘాలతో, గర్భిణి స్త్రీలతో వారికి కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి అందుతున్న పథకాల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.