సీతక్కను ఓడించేందుకు బీఆర్ఎస్ భారీ స్కెచ్.. వారితో రహస్య మంతనాలు
మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు 5వ షెడ్యూల్
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మండలంలో ఎదురుదెబ్బ తగలనుంది. పాత కాంగ్రెస్, పసుపు కాంగ్రెస్‌గా రెండు గ్రూపులుగా పార్టీ విడిపోయింది. దీంతో బీఆర్ఎస్ పాత కాంగ్రెస్ నేతలను మచ్చిక చేసుకుని బీఆర్ఎస్‌లో చేర్పించేందుకు రంగంలో దిగారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటమే ధ్యేయంగా పావులు కదుపుతున్న అధికార పార్టీ ఇక్కడ గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మంత్రులు యర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో అసమ్మతి వర్గాలను పార్టీలో చేర్పించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పాత కాంగ్రెస్ నేతలను అక్కున చేర్చుకునేందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంతనాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు పసుపు కాంగ్రెస్‌గా పేరున్న నేతలు ఎమ్మెల్యే సీతక్కతోనే పయనిస్తుండగా.. పాత కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మండలంలో సీతక్కకు గట్టి ఎదురుదెబ్బ తప్పనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నష్ట నివారణ చర్యలకు సీతక్క రంగంలోకి దిగకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దిశ, మంగపేట: మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు 5వ షెడ్యూల్గ్రామాలేనంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ నాయకులకు అస్త్రంగా మారింది. మంగపేటను షెడ్యూల్ ప్రాంతంగా వచ్చేలా ఆదివాసీ గిరిజనులకు ఎమ్మెల్యే సీతక్క అంగ, ఆర్థిక బలం చేకూర్చిందని, అందువల్లనే కోర్టు తీర్పు మండలంలోని గిరిజనేతరులకు శాపంగా మారిందని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీతక్కను మండలంలో అన్ పాపులర్ చేసే ప్రయత్నాలు చేస్తుండగా.. కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు ఈ విషయంలో ఎటూ తెల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విషయంలో సీతక్కకు ఎటువంటి సంబంధం లేదంటే గిరిజనులతో, ఉందంటే గిరిజనేతరులతో ఇబ్బంది వస్తుందని, దీంతో వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాలు దూరమయ్యే పరిస్థితి ఉందని బేరీజు వేస్తున్నారు. బీఆర్ఎస్ దీన్నే ఆయుధంగా మలుచుకోని మండలంలో గిరిజనులతో సీతక్కకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన గిరిజన మహిళకు తమ పార్టీ టికెట్ ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఆమెకు మీరంతా అండగా ఉండాలని చెబుతూనే గిరిజనేతరులకు సీతక్క కోర్టు తీర్పుతో అన్యాయం చేసిందనే మైండ్ గేమ్ ఆడుతోంది.
కేటీఆర్ సమక్షంలో చేరిక...
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పాత కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరేందుకు కొందరు కాంగ్రెస్ నేతల వ్యూహం తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మంగపేట మండలంపై మంత్రులు యర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతిరాథోడ్ ప్రత్యేక దృష్టి పెట్టి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోని అసమ్మతి నేతలతో టచ్‌లో ఉంటూ చేతిని వీరిని కారులోకి ఎక్కాల్సిందిగా నజరానాలు ప్రకటిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో దూకుడు పెంచిన అధికార పార్టీ మండలంలోని కమలాపురం నుంచి అకినేపల్లి మల్లారం వరకు ఉన్న పాత కాంగ్రెస్ క్యాడర్‌ను కలుస్తూ మంతనాలు చేస్తూ పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అసమ్మతి కాంగ్రెస్ నేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తూ ఆ వెంటనే భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టేలా రంగం సిద్దం చేస్తున్నారు. అన్ని అనుకన్నట్లు జరిగితే అక్టోబర్ 6న వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సమావేశంలో వీరంతా కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీతక్క అనుచరుల ఆందోళన...
మండలంలో నెలకొన్న అసమ్మతిపై ఎమ్మెల్యే సీతక్క దృష్టి పెట్టకపోతే మండలంలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్న పాత కాంగ్రెస్ నాయకులతోపాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పసుపు కాంగ్రెస్ నాయకులకు మధ్య సయోధ్య కుదిర్చి ఇరువర్గాలు కలిసి పని చేసేలాగా చొరవ తీసుకోకుంటే మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం తప్పదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఆది నుంచి కంచుకోటగా ఉన్న హస్తం పార్టీ పాత కాంగ్రెస్, పసుపు కాంగ్రెస్ వర్గాలుగా చీలిపోయి ఓ వర్గం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సీతక్క ఓటమికి నడుం కడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో మండలంలో సీతక్కకు గట్టి ఎదురుదెబ్బ తప్పనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నష్ట నివారణ చర్యలకు సీతక్క రంగంలోకి దిగకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.