'ఆల‌య ప్రతిష్ఠాప‌నోత్సవానికి రండి'.. మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించిన గండ్ర దంపతులు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాప‌నోత్సవానికి స‌తీస‌మేతంగా రావాల‌ని గండ్ర దంప‌తులు మంత్రి కేటీఆర్‌ను కోరారు.

Update: 2023-08-10 13:01 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాప‌నోత్సవానికి స‌తీస‌మేతంగా రావాల‌ని గండ్ర దంప‌తులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. గురువారం హైద‌రాబాద్‌లోని మెట్రో భవన్‌లో భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి దంప‌తులు, బీఆర్‌ఎస్ యువజన నాయకుడు గండ్ర గౌతమ్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా భూపాల‌ప‌ల్లి జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్యల‌ను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా అకాల వర్షాలతో నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, విద్యుత్తు పునరుద్ధర‌ణ పనులకు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే వరద ప్రభావానికి పూర్తిగా దెబ్బతిన్న మోరాంచపల్లి గ్రామానికి అండగ నిలవాలని, ప్రత్యేకంగా గ్రామానికి నిధుల‌ను స‌మ‌కూర్చడంతో పాటు బాధితుల‌ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రయ‌త్నం చేయాల‌ని కోరారు. స‌ర్వస్వం కోల్పోయిన గ్రామ ప్రజ‌లు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆశ‌లు పెట్టుకున్నార‌ని గుర్తు చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ఔటర్ పనుల్ని వేగవంతం చేశామని, భూ సేకరణ పనులు జరుగుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించిన‌ట్లు గండ్ర దంప‌తులు మీడియాలో ప్రక‌ట‌న‌లో తెలిపారు.


Similar News