'ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డీడీను సస్పెండ్ చేయాలి..'

ఐటీడీఏ ఏటూరునాగారం గిరిజన సంక్షేమశాఖ (ట్రైబల్ వెల్ఫేర్)లో ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో గిరిజన ఉపాధ్యాయులను లంచాల కోసం వేధిస్తున్న డీడీ పోచంను వెంటనే సస్పెండ్ చేయాలని ఐటీడీఏ ట్రైబల్ వెల్పేర్ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా అద్యక్షుడు గొప్ప సమ్మారావు డిమాండ్ చేశారు.

Update: 2024-10-15 05:56 GMT

దిశ, మంగపేట : ఐటీడీఏ ఏటూరునాగారం గిరిజన సంక్షేమశాఖ (ట్రైబల్ వెల్ఫేర్)లో ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో గిరిజన ఉపాధ్యాయులను లంచాల కోసం వేధిస్తున్న డీడీ పోచంను వెంటనే సస్పెండ్ చేయాలని ఐటీడీఏ ట్రైబల్ వెల్పేర్ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా అద్యక్షుడు గొప్ప సమ్మారావు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కోమటిపల్లిలో వారు మాట్లాడుతూ ఐటీడీఏ ఏటూరునాగారం గిరిజన సంక్షేమశాఖలో జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి ఖాళీగా ఉన్న పోస్టులను బ్లాక్ చేసి సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం చేశారని ఆరోపించారు. తక్కవ విద్యార్థులున్న బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు జరిగి సీనియర్లకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా బదిలీలు, పదోన్నతుల్లో అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే జిల్లా స్థాయిలో సర్దుబాటు చేయాలన్న విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలను సైతం డీడీ పోచం లెక్కచేయకుండా ఉపాధ్యాయుల అర్జీలను లంచాల కోసం బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు.

ఐటీడీఏలో ఇంగ్లీషులో 3 ఖాళీలుండగా ఇద్దరికి పదోన్నతులిచ్చి ఒకరిని పక్కకు పెట్టారని, అదే విధంగా సాంఘీక శాస్త్రంలో ఇద్దరికి పదోన్నతులిచ్చి ఒక్కరిని పక్కకు పెట్టారని ఈ విషయంలో డీడీని ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తే పదోన్నతులనేటివి నిరంతర ప్రక్రియ అని సమస్యను దాటవేస్తున్నట్లు ఆరోపించారు. అర్హత ఉన్న ఫిజికల్ డైరెక్టర్ పోస్టును జూనియర్ కు ఇచ్చి సీనియర్ ఉపాధ్యాయులను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విభజన, జోనల్ బదిలీల్లో ఉపాధ్యాయ పోస్టులను సరైన విధంగా సర్దుబాటు చేయలేదన్నారు. దీంతో డైరెక్టు రిక్రూట్ మెంట్ పోస్టులను జీవొ 40 ప్రకారం కాకుండా జీవో 45 ప్రకారం అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 30 : 70 నిష్పత్తి ప్రకారం పదోన్నతులు కల్పిస్తే డీడీ పోచం అందుకు భిన్నంగా జీవో 40ని అమలు చేస్తూ గిరిజన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమ శాఖలో ఒంటెద్దు పోకడలతో గిరిజనుల విద్యాభివృద్ధిని అడ్డుకుంటున్న డీడీ వ్యవహార శైలి పై జిల్లా మంత్రి సీతక్క, కలెక్టర్, ఐటీడీఏ పీవోలు దృష్టి సారించి డీడీ పోచంను వెంటనే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడికి వెనుకాడమని సమ్మారావు హెచ్చరించారు. సమావేశంలో పొదేం కృష్ణ ప్రసాద్, పోడెం సమ్మయ్య, అజ్మీరా రాజు, జబ్బ రవి, మైపతి సంతోష్ కుమార్, కొండ చెంచయ్యలు పాల్గొన్నారు.


Similar News