వరంగల్‌లో కల్తీ బేకరీ సరుకులు…
కల్తీ నూనెల గురించి ఇప్పటివరకు విన్నాం.. ఇప్పుడు బేకరీ సరుకుల్లోనూ కల్తీ వెలుగు చూడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దిశ, వరంగల్ టౌన్ : కల్తీ నూనెల గురించి ఇప్పటివరకు విన్నాం.. ఇప్పుడు బేకరీ సరుకుల్లోనూ కల్తీ వెలుగు చూడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరంగల్ నగరంలోని లక్ష్మీపురం బొడ్రాయి సమీపంలోని ఓ బేకరీ ప్రొడక్ట్స్ షాపుల్లో టాస్క్‌ఫోర్సు దాడుల్లో కల్తీ సరుకులు, కాలం చెల్లిన పదార్థాలు గుర్తించడం విస్మయానికి గురి చేస్తోంది. గురువారం టాస్క్‌ఫోర్సు సిబ్బంది లక్ష్మీపురం బొడ్రాయి సమీపంలో బేకరీ ప్రొడక్ట్స్ విక్రయించే వినాయక క్వాలిటీ ఎంటర్ ప్రైజెస్ దాడులు నిర్వహించారు. 25 రకాల వివిధ సరుకులు కల్తీవిగా, కాలం చెల్లినవి గుర్తించారు. వీటి విలువ రూ.92,301 ఉంటుందని, అన్నింటినీ సీజ్ చేశామని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బాబులాల్, ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి తెలిపారు. షాపు యజమాని వనం శ్రీనాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాపారులు ఎవరైనా కల్తీ సరుకులు విక్రయించినా, కాలం చెల్లిన పదార్థాలు నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జి బాబులాల్ హెచ్చరించారు.