‘వీవీప్యాట్ స్లిప్స్ అంటే తిరిగి బ్యాలెట్‌కు వెళ్లడమే!’
100 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులతో ఈవీఎంల వినియోగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: 100 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులతో ఈవీఎంల వినియోగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇలా చేయడం అంటే తిరిగి పేపర్ బ్యాలెట్ విధానానికి మళ్లడమే అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. అన్ని పోలింగ్ బూత్ లలోని వీవీప్యాట్ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో ఈసీఐ 469 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసింది. వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించడంలో మానవ తప్పిదం జరగే అవకాశాలు ఉంటాయి కానీ ఈవీఎం కౌంటింగ్‌లో ఎటువంటి వ్యత్యాసానికి అవకాశం ఉండదని ఈ సందర్భంగా ఈసీఐ పేర్కొంది.
బ్యాలెట్ యూనిట్‌లో వేసిన ఓటును తక్షణమే ధృవీకరించుకునేందుకు వీవీప్యాట్ స్లిప్ ఆడిట్ ట్రయల్‌గా పేర్కొన్న ఈసీ.. వీవీప్యాట్ స్లిప్ లను 100 శాతం కౌంటింగ్ చేయాలంటే ఇది తిరోగమణ ఆలోచన అవుతుందని ఈ విధానం తిరిగి బ్యాలెట్ విధానానికి వెళ్లడం లాంటిదేనని అభిప్రాయపడింది. ఈవీఎంకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సమక్షంలోనే అత్యంత పారదర్శకంగా నిర్వహించబడుతాని వీటిని హ్యాక్ చేయడం లేదా తారుమారు చేయడం సాధ్యం కాదని అఫిడవిట్‌లో పేర్కొంది. వీవీప్యాట్‌లను ప్రవేశపెట్టినప్పటి నుంచి 118 కోట్ల మంది ఓటర్లు పూర్తి సంతృప్తితో ఓట్లు వేశారని, రూల్ 49ఎంఏ కింద కేవలం 25 (ఇరవై ఐదు) ఫిర్యాదులు వచ్చాయని, అవన్నీ అబద్ధమని తేలిందని అఫిడవిట్ పేర్కొంది.