Village Secretary: సంకటంలో.. పంచాయతీ కార్యదర్శులు

వీధిలైట్లు వెలగక పోయినా.. మురుగు సమస్య తలెత్తినా.. నీటి సరఫరా సక్రమంగా లేకపోయినా.. రోడ్లు పాడైనా.. నర్సరీ, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎండినా.. వర్కర్లకు జీతాలు ఇవ్వకపోయినా పంచాయతీ సిబ్బందిదే బాధ్యత అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంది.

Update: 2024-11-30 02:05 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : వీధిలైట్లు వెలగక పోయినా.. మురుగు సమస్య తలెత్తినా.. నీటి సరఫరా సక్రమంగా లేకపోయినా.. రోడ్లు పాడైనా.. నర్సరీ, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎండినా.. వర్కర్లకు జీతాలు ఇవ్వకపోయినా పంచాయతీ సిబ్బందిదే బాధ్యత అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంది. ఇంటి పన్ను వసూళ్లతో సహా, ఇతరాత్ర మార్గాల ద్వారా వచ్చిన ‘క్యాష్ ఇన్ హ్యాండ్’ డబ్బులను సర్దుబాటు చేసి గ్రామీణులకు మెరుగైన వసతులను కల్పించాలని హుకుం జారీ చేసింది. దీంతో గత బీఆర్ఎస్ సర్కార్ నిధులు ఇవ్వకున్నా మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో పన్నులు, ఇతరాత్ర మార్గాల ద్వారా ‘క్యాష్ ఇన్ హ్యాండ్’ వచ్చిన డబ్బులతో కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు గ్రామ పంచాయితీల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించారు. అయితే ప్రస్తుతం ‘క్యాష్ ఇన్ హ్యాండ్ ’ ద్వారా వచ్చిన డబ్బులు తక్షణమే తిరిగి ఖాజానాకు జమ చేయాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. డబ్బులు చెల్లించకుంటే శాఖా పరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెడుతామని నోటీసులు జారీ చేసినట్లు గ్రామపంచాయతీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

గత సర్కార్ ఆదేశంతోనే..

గత సర్కార్ స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసింది. దీంతో గ్రామాల్లో అత్యవసర పనులైన సిబ్బంది వేతనాలు, నీటి సరఫరా, నిత్యం మురుగు కాల్వల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ బాధ్యత కార్యదర్శులపైన పడింది. దీంతో కొందరు కార్యదర్శులు తమ జేబుల నుంచి గానీ లేదా ఇంటి పన్నులు, భవన నిర్మాణాల అనుమతులు ఇతరాత్రా సేవల ద్వారా గ్రామ పంచాయతీకి వచ్చిన ‘క్యాష్ ఇన్ హ్యాండ్’ రాబడి నుంచి చెల్లించాల్సి వచ్చింది. ఇలా ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో కార్యదర్శలు, బిల్ కలెక్టర్లు ఒక్కో పంచాయితీలో రూ.లక్షల్లో అత్యవసర పనుల నిమిత్తం ఖర్చు చేయగా, వాటికి గ్రామ పంచాయతీ పాలకవర్గాలు తీర్మాణాలు చేయగా, ఈ ఖర్చులకు సంబంధించిన బిల్లులు ఎస్టీవో లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. బిల్లుల కోసం ఏళ్ల తరబడి జిల్లా ట్రెజరీ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది.

ఒత్తిళ్లతో మనోవేదన..

పల్లెల్లో ఇంటి పన్నులు, ఇతరాత్రా మార్గాల ద్వారా వసూలు చేసిన సొమ్మును తిరిగి గ్రామపంచాయతీ ఖజానాకు జమ చేయాలని జిల్లా అధికారులు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అయితే తాము గత ప్రభుత్వ ఆదేశాల మేరకే పంచాయతీ తీర్మానం, ఉన్నతాధికారుల ఆమోదంతోనే అత్యవసర పనుల కోసం ఖర్చు చేశామని, తమ సొంతానికి వాడుకోలేదని ఉద్యోగులు అంటున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు ఎస్టీవో లో ఉన్నాయని, ప్రభుత్వంతో మాట్లాడి నిధులను మంజూరు చేసి ఖజానాకు మళ్లించుకోవాలని చెబుతున్నా.. తమ గోడును ఎవరు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. డబ్బులు చెల్లించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని, దీంతో తామంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల బెదిరింపులతో ఇటీవల ఓ మహిళ కార్యదర్శి తన మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించగా, మరో బిల్ కలెక్టర్ తెలిసిన వాళ్ల వద్దఅధిక వడ్డీకి అప్పు తెచ్చి డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. అయితే ఇటీవల జిల్లా అధికారులు వేధింపులు మరింత ఎక్కువయ్యాయని పలువురు కార్యదర్శలు, బిల్ కలెక్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించిన తమ సమస్యను పరిష్కరించాలని కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News