MalkajGiri: భవనానికో రేటు.. ఆయన రూటే సప‘రేటు’
మల్కాజిగిరి సర్కిల్ పట్టణ ప్రణాళిక విభాగంలో చైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
దిశ, మల్కాజిగిరి : మల్కాజిగిరి సర్కిల్ పట్టణ ప్రణాళిక విభాగంలో చైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈయన లంచావతార బాగోతం గతంలో సోషల్ మీడియాలో వైరలైనా ప్రజాపాలనలో ఫిర్యాదులు చేసినా ఇతడే సమర్దుడని తిరిగి చైన్‌మెన్‌గా బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణాదారులు ఆయన పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు. ఫిర్యాదులు వస్తున్నాయి పనులు అపేయాలంటూ హుకుం జారీ చేయడం, సదరు నిర్మాణదారులకు ఫిర్యాదుదారులతో సెటిల్ చేసుకోవాలి లేదంటే పనులు జరుగవంటూ పనులను నిలిపివేయడంతో, చేసేదేమీ లేక అడిగిన ముడుపులు ఇచ్చుకుని పనులు చక్కబెట్టుకుంటున్నామని పలువురు వాపోతున్నారు.
మున్సిపల్ పరిధిలో పలుచోట్ల చేపట్టే నిర్మాణాల నుంచి లక్షల్లో వసూలు చేయడం, మద్యవర్తుల ముసుగులో మనీ అందినకాడికి దండుకోవడంలో ఇతడే దిట్టని పలువురు చర్చించుకుంటున్నారు. యాప్రాల్ లో కమర్షిల్ నిర్మాణం చేపడుతున్నారంటూ ఫిర్యాదులోచ్చాయని సదరు భవన నిర్మాణదారుడిని వేలల్లో డిమాండ్ చేయటం, ఫిర్యాదు దారులతో సెటిల్ చేసుకోవాలంటూ మున్సిపల్ కార్యాలయం సాక్షిగా మనీ దందాకు పాల్పడుతున్నాడనే పలువురు బహిరంగగానే ఆరోపిస్తున్నారు. యాప్రాల్ ప్రధాన రహదారికి సమీపంలోని పాత ఇంటిపై రెండతస్తుల నిర్మాణం చేపడుతుంటే చైన్ మెన్ సుమారు నెల రోజుల పాటు పనులు జరుగకుండా ఆపేసి అందినకాడికి దండుకున్నాడని ఇదే పరిసర ప్రాంతాల్లో అంతా తానై చక్రం తిప్పి లక్షల్లో వసూలు చేసినట్లు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో ఆయన మనీలీలలు ఇటీవల జరుగుతున్న నిర్మాణాలను కదిలిస్తే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అవినీతికి పాల్పడుతూ వసూల్ రాజాగా మారినట్లు పలువురు ఫిర్యాదులు చేసినా అధికారులు మాత్రం ఇతడికే చైన్ మెన్ బాధ్యతలు అప్పగించడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సైతం ఇతడి మాయలోనే మునుగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇక్కడి అక్రమ నిర్మాణాల వ్యవహారంపై దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.