అధికారాన్ని కాదు...ఆత్మ గౌరవాన్ని కోల్పోయాం : స్వామి గౌడ్

అధికారాన్నే కాదు.. ఆత్మగౌరవాన్ని కోల్పోయామని శాసన మండలి మాజీ చైర్మన్ టి. స్వామి గౌడ్ అన్నారు.

Update: 2024-11-29 12:51 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : అధికారాన్నే కాదు.. ఆత్మగౌరవాన్ని కోల్పోయామని శాసన మండలి మాజీ చైర్మన్ టి. స్వామి గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అధ్యక్షతన శుక్రవారం దుండిగల్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్ష దివాస్ లో స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ధ్వంసం అవుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే హైదరాబాద్ లో పచ్చ జెండాల ఊరేగింపులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొంత మంది కార్పొరేటర్లను గెలిపించుకోవాలని ఆయా పార్టీలు వ్యూహం పన్నుతున్నాయని, ఆ తర్వాత తెలంగాణ నుంచి నీళ్లు, నిధులను తరలించుకుపోయే కుట్ర జరుగుతుందని స్వామి గౌడ్ హెచ్చరించారు.

    తెలంగాణను కాపాడుకునేందుకు మరో ప్రజా ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉ:దన్నారు. ఉద్యమ కారులు, పార్టీ శ్రేణులు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిందే నిధులు, ఉద్యోగాలు, రాజకీయ అస్థిత్వం కోసమన్నారు. ఇతర పార్టీల 60 ఏళ్లబడిలో ఒక లక్ష 25 వేల ఇండ్లను నిర్మిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 5 ఏళ్ల కాలంలోనే 3 లక్షల ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ నుంచి 80 శాతం ఆదాయం వస్తే ఖర్చు మాత్రం 20 శాతమే పెట్టేవారని, ఏపీ ప్రాంతం నుంచి 20 శాతం ఆదాయం వస్తే ఆ ప్రాంతం కోసం 80 శాతం ఖర్చు చేసేవారన్నారు. తెలంగాణ వాళ్లకు చదవు రాదని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ పరిస్థితి మళ్లీ రాకుండా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలపై ఉందని స్వామి గౌడ్ తెలియజేశారు.

దేశానికే ఆదర్శం కేసీఆర్ పాలన : మల్లారెడ్డి

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా కేసీఆర్ పాలించారని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలన చూసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనతో విసిగిపోయారని విమర్శించారు. పల్లెలు, పట్టణాల్లో కాంగ్రెస్ పాలన వైఫల్యంపై చర్చ నడుస్తుందన్నారు. ఇంత దరిద్రమైన కాంగ్రెస్ పాలనను తానేప్పుడూ చూడలేదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకుంటామని, కార్యకర్తలు దిగులు పడొద్దన్నారు. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు దక్కనున్నాయని, వారంతా సిద్దం కావాలన్నారు.

తానెప్పుడూ ఉద్యమంలో పాల్గొనలేదు : క్రిష్ణారావు

తానేప్పుడూ ఉద్యమంలో పాల్గొనలేదని కూకట్ పల్లి శాసన సభ్యులు మాధవరం క్రిష్ణారావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీ వాళ్లను చూస్తే భయటకు వెళ్లే వాళ్లంకాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని దాడి చేస్తారేమోనని భయపడేవాళ్లమన్నారు. కేసీఆర్ సీఎం అయిన సీమాంధ్రులపై దాడులు జరుగుతాయనుకున్నామన్నారు. కానీ రాష్ట్ర అభివృద్ది విషయంలో తీసుకున్న నిర్ణయాలతో పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. గతంలో ఒక కార్పొరేటర్ కూడా గెలవని బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ పరిధిలో మొత్తం ఎమ్మెల్యేలు గెలిచిందన్నారు. కేసీఆర్ నాయకత్వంపైన నమ్మకంతోనే ఇంత మంది ఎమ్మెల్యేలు గెలిచినట్లు క్రిష్ణారావు తెలియజేశారు.

ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్ దే అధికారం : వివేక్

ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీదే అధికారమని, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. మనం ఓపిక పట్టిన ప్రజలు పట్టేలా లేరన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలను వీడియో రూపంలో రాబోయే తరాలకు అందించాలని సూచించారు. ఉద్యమకారులకు పార్టీ అండగా ఉంటుందన్నారు.

అపోహలతోనే అధికారం కోల్పోయాం : మర్రి రాజశేఖర్ రెడ్డి

అపోహలతోనే అధికారాన్ని కోల్పోయామని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు ఎక్కువయ్యాయని మండి పడ్డారు. మళ్లీ ఉద్యమంచి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేద్దామని మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రజా విజయమే : శంభీపూర్ రాజు

గిరిజన, దళిత పేద రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేసిన పోరాటం వల్లనే రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ప్రజా ఉద్యమంతోనే లగచర్లలో భూ సేకరణ నిలిపివేసిందని తెలిపారు. అదే విధంగా రైతుల పక్షాన పోరాటం చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించిందన్నారు.

    లగచర్ల ఘటనకు సంబంధించిన ఆయనపై నమోదైన రెండు కేసులను హైకోర్టు కొట్టేసినట్లు రాజు ప్రకటించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన కమిటీని నియమిస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దీక్ష దివాస్ లో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్ చార్జీ రాగిడి లక్ష్మారెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, ఉద్యమ కారులు మాట్లాడారు.


Similar News