గిగ్,ప్లాట్‌ఫాం సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి భేటీ.. కార్మికుల సామాజిక భద్రతపై చర్చ

గిగ్, ప్లాట్‌ఫాం కార్మికుల సామాజిక భద్రతపై ఆయా సంఘాల ప్రతినిధులతో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మ‌న్సూఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం కీలక సమావేశం జరిగింది.

Update: 2024-10-21 16:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గిగ్, ప్లాట్‌ఫాం కార్మికుల సామాజిక భద్రతపై ఆయా సంఘాల ప్రతినిధులతో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మ‌న్సూఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం కీలక సమావేశం జరిగింది. కాగా అందులో గిగ్, ప్లాట్‌ఫాం కార్మికుల కోసం సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాల ఫ్రేమ్‌వర్క్ రూపొందించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో అగ్రిగేటర్లతో పైలట్ పరీక్షలు విజయవంతం కావడంతో మాడ్యూల్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. కార్మికుల నమోదుపై అగ్రిగేటర్లకు సూచనలు జారీ చేశారు. సామాజిక భద్రత హక్కుల కోసం ప్రత్యేక ఐడీతో అన్ని ప్రయోజనాలను పొందేలా అనుసంధానం చేయాలని, అలాగే ఇంటర్‌స్టేట్ పోర్టబిలిటీ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. సంస్థలు.. కేంద్ర, రాష్ట్ర పోర్టళ్లలో తప్పనిసరిగా కార్మికుల వివరాలు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కార్మికులందరూ సంక్షేమ పథకాల పరిధిలోకి రావాల‌ని, స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలని ఈ సమావేశంలో డిసిషన్ తీసుకున్నారు.

ఇదిలా ఉండగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మంత్రికి పలు కీలక సూచనలు చేశారు. కార్మిక హక్కుల కోసం చట్టం, త్రిసభ్య సంక్షేమ బోర్డులను ఏర్పాటుచేయాలని, కనీస ఆదాయం, యజమాని-ఉద్యోగి గుర్తింపు విధానం అమలుచేయాలన్నారు. ప్లాట్‌ఫాం కార్మికుల ఫిర్యాదులు, పరిష్కార విధానాలు ఇంప్లిమెంట్ చేయాలని సూచించారు. ఆరోగ్య భద్రత ప్రతి కార్మికుడి హక్కు అని, పని ప్రదేశాల్లో మహిళల భద్రత, 2013 మహిళల లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలుచేయాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంధ్లాజే, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Similar News