విభజన చట్టంలో హామీల అమలుకు ఎల్లుండి ఢిల్లీకి సీఎస్

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (విభజన) చట్టంలోని 13వ షెడ్యూలులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పురోగతిపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 24న ఢిల్లీ వెళ్తున్నారు.

Update: 2024-10-21 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (విభజన) చట్టంలోని 13వ షెడ్యూలులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పురోగతిపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 24న ఢిల్లీ వెళ్తున్నారు. విభజన చట్టంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విద్య, మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించి ఏడు హామీలను పొందుపరిచింది. పదేండ్ల వ్యవధిలో వీటిని కల్పించాలని చట్టంలో నిర్దేశించడంతో వాటి ప్రోగ్రెస్‌పై కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో జరిగే ఈ మీటింగులో సంబంధిత కేంద్ర శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు వివరించనున్నారు. తెలంగాణలో ట్రైబర్ యూనివర్శిటీ, హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుతో పాటు కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. ఇందుకు అవసరమైన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూర్చేలా స్పష్టత ఇచ్చింది. ఇవి ఏ మేరకు సాకారమయ్యాయో, ప్రస్తుతం వాటి పనులు ఏ దశలో ఉన్నాయో రాష్ట్ర, కేంద్ర అధికారులు ఈ సమావేశంలో రివ్యూ చేయనున్నారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్శిటీ హోదా) ఏర్పాటు చేసేలా అప్పటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీ ఇచ్చినా 2019 నాటికే ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. మొత్తం రూ. 825 కోట్లను కేంద్ర ప్రభుత్వం తరపున అందించేలా హామీ ఇచ్చి ఆ ఆర్థిక సంవత్సరంలోనే రూ. 400 కోట్లను మంజూరు చేసింది. కానీ తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి మాత్రం గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటన చేసి డిసెంబరులో (విభజన చట్టం అమలులోకి వచ్చిన తొమ్మిదిన్నరేండ్ల తర్వాత) నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ నిర్దిష్టంగా ఎంత మొత్తంలో నిధులు ఇవ్వనున్నది మాత్రం వెల్లడించలేదు. అదే తరహాలో కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్లు చట్టంలో పేర్కొన్నా దాన్ని పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్ షాపు స్థాయికి మాత్రమే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. గడచిన పదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోచ్ ప్యాక్టరీ కోసం కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఇటీవల ఈ విషయాన్ని ప్రధాని మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి చేశారు.

ఇక బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పడానికి చొరవ తీసుకోనున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఆర్థికంగా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ (మెటలర్జికల్ అండ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్) నివేదికలో స్పష్టం చేసింది. బయ్యారం పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యే ముడి ఇనుములో నాణ్యత తక్కువగా ఉన్న కారణంగా కేవలం పిల్లెట్ల తయారీకి మాత్రమే పనికొస్తుందని పేర్కొన్నది. గత రాష్ట్ర ప్రభుత్వం చత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనులతో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అవసమైతే రైల్ కనెక్టివిటీ కోసం రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చును భరించేలా సూచించింది. కానీ ఆ ప్రతిపాదనలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ హామీలకు తోడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో వెనకబడిన ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ కోసం చర్యలు తీసుకోనున్నట్లు విభజన చట్టంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో ఎన్ని పనులు పూర్తి స్థాయిలో అమలయ్యాయో లేదో ఈ నెల 24న జరిగే సమావేశంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు సమీక్షించనున్నారు.

తెలంగాణ చీఫ్ సెక్రటరీతో కేంద్ర హోం కార్యదర్శి ఈ నెల 24న నిర్వహించే ఈ సమావేశానికి పై హామీలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల తరఫున కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ (హార్టికల్చర్ యూనివర్శిటీ), మానవ వనరుల అభివృద్ధి శాఖ (సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ), ఇనుము-ఉక్కు మంత్రిత్వశాఖ (బయ్యారం స్టీల్ ప్లాంట్), విద్యుత్ శాఖతో పాటు బొగ్గు మంత్రిత్వశాఖ (ఎన్టీపీసీ 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్, దానికి అవసరమైన బొగ్గు లింకేజీ), ఉపరితల రవాణా శాఖ (నేషనల్ హైవేస్ అథారిటీ రోడ్డు కనెక్టివిటీ), రైల్వే మంత్రిత్వశాఖ (కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ) తదితర విభాగాల అధికారులు హాజరుకానున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ ను ఈ సమావేశానికి అందించనున్నారు. ఈ సమావేశంలో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర అధికారుల నుంచి చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి ఇప్పటికే వివరాలను సేకరించారు. వీటిపై సమావేశంలో హోం కార్యదర్శికి, కేంద్ర అధికారులకు వివరించనున్నారు.


Similar News