ఆసుపత్రుల్లో గర్భిణులను వెయిట్ చేయించొద్దు: అధికారులకు మంత్రి దామోదర కీలక ఆదేశాలు

మాతా, శిశు ఆరోగ్య కేంద్రాలు, (ఎంసీహెచ్‌) ఇతర ప్రభుత్వాసుపత్రులలో స్కానింగ్ కోసం గర్భిణీలు ఎక్కువ సేపు వెయిట్ చేయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అవసరమైతే స్కానింగ్ యంత్రాల సంఖ్యను పెంచుకోవాలని, గర్భిణులను గంటలకొద్దీ వెయిట్ చేయించొద్దని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-10-21 16:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాతా, శిశు ఆరోగ్య కేంద్రాలు, (ఎంసీహెచ్‌) ఇతర ప్రభుత్వాసుపత్రులలో స్కానింగ్ కోసం గర్భిణీలు ఎక్కువ సేపు వెయిట్ చేయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అవసరమైతే స్కానింగ్ యంత్రాల సంఖ్యను పెంచుకోవాలని, గర్భిణులను గంటలకొద్దీ వెయిట్ చేయించొద్దని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుని వెంటనే చెక్ పెట్టాలన్నారు. డాక్టర్లు కూడా గర్భిణీలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక గర్భిణులు, వారి వెంబడి వచ్చిన కుటుంబ సభ్యులు కూర్చునేందుకు సీటింగ్ అరెంజ్‌మెంట్ చేయాలని సూచించారు.

జిల్లాల్లోని హాస్పిటల్స్‌ నుంచి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాకు చిన్న చిన్న కేసులను కూడా రిఫర్ చేసి పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని మంత్రి సూచించారు. జిల్లాల్లోనే ట్రీట్‌మెంట్ అందించాలని, తప్పనిసరి అయితేనే హైదరాబాద్‌కు రిఫర్ చేయాలని మంత్రి సూచించారు. మెడికల్ కాలేజీలు, అనుబంధ హాస్పిటల్స్‌(టీచింగ్ హాస్పిటల్స్‌) పని తీరుపై మంత్రి సోమవారం రివ్యూ చేశారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, గాంధీ, ఉస్మానియా సహా వివిధ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్‌, తదితరులు పాల్గొన్నారు. టీచింగ్ హాస్పిటళ్ల అవుట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్ సర్వీసులు, బెడ్ స్ర్టెంగ్త్, తదితర అంశాలపై డీఎంఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

బ్రాండ్ పెంచాలి.. రివ్యూ చేస్తాం..

ప్రభుత్వ దవాఖానాల్లో బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డాక్టర్లు పని చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. ప్రభుత్వ దవాఖాన్ల బ్రాండ్ ఇమేజ్ పెంచాలని, ప్రజలకు హాస్పిటళ్లపై మరింత నమ్మకం, భరోసా కల్పించేలా పని విధానం ఉండాలని అన్నారు. హాస్పిటల్స్‌లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అదే సమయంలో ఆసుపత్రుల పని తీరును కూడా రివ్యూ చేస్తామని, పేషెంట్లకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని అన్నారు. సానిటేషన్, సెక్యూరిటీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. హాస్పిటల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేసి, ఎక్కడైనా సానిటేషన్ సరిగా లేకపోతే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎంఈని, సెక్రటరీని మంత్రి ఆదేశించారు.

కొత్త ఎక్విప్‌మెంట్స్ తీసుకోండి..

ఆసుపత్రుల్లో ఉన్న ఎక్విప్‌మెంట్స్ రిపేర్లు వస్తే వెంటనే బాగు చేయించాలని, రిపేర్ల సాకుతో పేషెంట్లను బయటకు రిఫర్ చేయొద్దని అన్నారు. పేషెంట్ల లోడుకు అనుగుణంగా ఎక్విప్‌మెంట్స్‌ను సమకూర్చుకోవాలని, అవసరమైన హాస్పిటళ్లకు కొత్త ఎక్విప్‌మెంట్ మంజూరు చేయాలని సెక్రటరీకి మంత్రి సూచించారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఫైళ్లను పెండింగ్ పెట్టొద్దని, వెంటనే క్లియర్ చేయాలని డీఎంఈకి మంత్రి సూచించారు. ఇక నిజామాబాద్‌ హాస్పిటల్ నుంచి బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. రాత్రి పూట సెక్యూరిటీని మరింత పటిష్టం చేయాలని, హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లే వారిని, లోపలికి వచ్చే వారిని తరువుగా తనిఖీ చేయాలని సూచించారు. నిర్మల్‌ ప్రభుత్వ దవాఖానలో అగ్ని ప్రమాదంపై సైతం మంత్రి ఆరా తీశారు. రెగ్యులర్‌‌గా ఫైర్ ఆడిట్ చేయాలని, ఇలాంటి ఘటనల పునరావృతం అవకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఫైర్ అలార్మ్స్‌, మంటలను ఆర్పే ఎక్విప్‌మెంట్‌ అన్ని హాస్పిటళ్లలో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా, షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా రెగ్యులర్‌‌గా తనిఖీలు చేయాలని, అవసరమైన చోట వైరింగ్ మార్చాలని మంత్రి సూచించారు.


Similar News