బొగ్గు లేకుండా విద్యుదుత్పత్తి సాధ్యం కాదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బొగ్గు లేకుండా విద్యుదుత్పత్తి సాధ్యం కాదని, అందుకోసం బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు మరింత కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-21 17:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బొగ్గు లేకుండా విద్యుదుత్పత్తి సాధ్యం కాదని, అందుకోసం బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు మరింత కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్ ఆవరణలో మైన్ డెవలప్‌మెంట్ ఆపరేటర్ల(ఎండీవో)తో సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఎండీవోలకు స్టార్ రేటింగ్స్ ప్రకటించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో దేశంలో ఎదురయ్యే పవర్ డిమాండ్ కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల సంక్షేమం, గనులకోసం భూములు వదిలి వెళ్తున్న వారందరి సంక్షేమం గురించి ఆలోచించాలని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మైన్ డెవలప్‌మెంట్ ఆపరేటర్లు.. తమ ప్రాంతం నుంచి ఉద్యోగులను తెచ్చుకుంటామని భావించొద్దని సూచించారు. మైన్ డెవలప్‌మెంట్ ఆపరేటర్లు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. కోల్ బేరింగ్ ప్రాంతాల్లో కాలుష్యం విస్తరించకుండా అటవీకరణపై దృష్టిపెట్టాలని, మైనింగ్ పూర్తయిన గనులను మూసివేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.

కోలిండియా ఏర్పాటై 50 ఏళ్లు పూర్తికావస్తోందని, వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకోవాలన్నారు. బొగ్గు ఉత్పత్తి ఒక్కరోజు ఆగినా.. పేపర్లలో హెడ్ లైన్స్ వస్తాయనే విషయాన్ని మరిచిపోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దత్, కోలిండియా చైర్మన్ పీఎం ప్రసాద్, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మైన్ డెవలప్‌మెంట్ ఆపరేటర్లు పాల్గొన్నారు.


Similar News