ఒక్క అమెరికాకే రూ.67 వేల కోట్ల ఫార్మా ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారత్ గతేడాది 1.83 లక్షల కోట్ల విలువైన ఫార్మాసుటికల్ ఉత్పత్తులను ఎగుమతి చేసిందని, ఇందులో 35 శాతం.. అంటే రూ.67 వేల కోట్ల

Update: 2024-07-07 17:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ గతేడాది 1.83 లక్షల కోట్ల విలువైన ఫార్మాసుటికల్ ఉత్పత్తులను ఎగుమతి చేసిందని, ఇందులో 35 శాతం.. అంటే రూ.67 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను ఒక్క అమెరికాకే ఎగుమతి చేసినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారతీయ ఫార్మాసుటికల్ ఉత్పత్తులు నాణ్యతలో, అన్ని విధాల బెస్ట్ అని దీనిద్వారా రుజువవుతోందన్నారు. హైటెక్స్‌లో ఆదివారం జరిగిన ఇండియన్ ఫార్మాసుటికల్ కాంగ్రెస్ 73వ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. హైదరాబాద్‌ను ఫార్మసీ హబ్‌గా మార్చడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు.

దేశ ఎగుమతుల్లో ఫార్మా ఉత్పత్తులే ఐదో అతి పెద్ద కమాడిటీ అని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల్లో 5 శాతం కన్న ఎక్కువ వాటా ఫార్మా రంగానిదేనని కొనియాడారు. కరోనా కష్టకాలంలో దేశం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేసి యావత్ ప్రపంచానికి అందజేసిందన్నారు. భారతదేశం దాదాపు 75 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను 94 దేశాలు, ఐక్యరాజ్య సమితికి చెందిన రెండు ఎంటీటీలకు అందజేయడంతో భారత్ విశ్వబంధుగా ప్రపంచంలో కీర్తిపొందిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఫార్మా పరిశ్రమ మద్దతు చాలా అవసరమని కిషన్ రెడ్డి తెలిపారు. 2027 నాటికి భారత్ ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలని ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారన్నారు.

ప్రస్తుతం దేశంలో 74 ఆపరేషనల్ విమానశ్రయాలు ఉన్నాయని, రవాణా, హైవే బడ్జెట్ కేటాయింపులు చూస్తే 2014 తర్వాత 500 శాతం పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేషనల్ హైవే నెట్ వర్క్ 2014 లో 91,287 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు లక్షన్నర కిలోమీటర్లకు.. అంటే 60 శాతం పెరిగిందని వివరించారు. దేశ విద్యుత్ డిమాండ్ 2013-14 లో 136 గిగా వాట్స్ ఉంటే.. 2023 నాటికి 244 గిగా వాట్స్.. అంటే 508 శాతం పెరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మౌలిక సదుపాయల వల్ల ఫార్మా వంటి రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం కాలం చెల్లిన 1,562 చట్టాలను రద్దు చేసిందన్నారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి రూ.15 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. రాబోయే బల్క్ డ్రగ్ పార్కులో కామన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని పెంచడానికి మోడీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని కిషన్‌ రెడ్డి తెలిపారు.

ఆరోగ్యరంగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మెడికల్ కాలేజీలు పెరిగాయన్నారు. దేశవ్యాప్తంగా 2014లో 388 ఉంటే ఇప్పుడు 706కుపైగా ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అంటే 82 శాతం పెరిగాయన్నారు. ఎంబీబీఎస్ సీట్లు112 శాతం పెరిగాయన్నారు. 2014లో 51,348 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే అవి ఇప్పుడు ఒక లక్ష 9 వేలకు పెరిగాయని పేర్కొన్నారు. పీజీ సీట్లు కూడా 127 శాతం పెంచినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటుకు తనవంతు ప్రయత్నం చేస్తానని కిషన్ రెడ్డి హమీ ఇచ్చారు.


Similar News