ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. మతోన్మాదంతోనే చేశారంటూ కిషన్‌రెడ్డి ఫైర్
మతోన్మాదంతోనే ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు....
దిశ, వెబ్ డెస్క్: మతోన్మాదంతోనే ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయాన్ని(Secunderabad Mutyalamma Temple) ఆయన సందర్శించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. డీజేలపై నిషేధం విధించిన పోలీసులు.. దేవాలయాల పరిరక్షణపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దుర్గమ్మ నవరాత్రుల పూజ సందర్భంగా చాలా రకాల ఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఘటన మర్చిపోకముందే మరో ఘటన జరిగిందని మండిపడ్డారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ దుర్గామాత ఆలయంలో దొంగతనానికి రాలేదని, దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికే వచ్చి ఉంటారని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో వచ్చి సికింద్రాబాద్ ముత్యాలమ్మ వారి విగ్రహాన్ని తొలగించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల వద్ద రాత్రి సమయంలో పోలీస్ పర్యవేక్షణ ఉండాలని కిషన్ రెడ్డి కోరారు.
కాగా సికింద్రాబాద్ కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని రాత్రి సమయంలో దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పగలగొడుతున్న శబ్దాలు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఒక దుండగుడిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పారిపోయారు. ఈ ఘటనపై హిందూసంఘాలతో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. నిందితులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.