Bachannapeta: నత్తనడకన.. ముందుకు సాగని పల్లె దవాఖాన భవన నిర్మాణాలు

ప్రజలకు వైద్యసేవలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం బచ్చన్నపేట మండలంలో ఆరు పల్లె దవాఖానా భవన నిర్మాణాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది.

Update: 2024-12-22 02:17 GMT

దిశ, బచ్చన్నపేట: ప్రజలకు వైద్యసేవలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం బచ్చన్నపేట మండలంలో ఆరు పల్లె దవాఖానా భవన నిర్మాణాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ దవాఖానాలో మూడు గదులు, ఓస్టోర్‌ రూం నిర్మించనున్నారు. మొత్తం 1020 చదరపు అడుగులు ఉండేలా పల్లె దవాఖానాలను డిజైన్‌ చేశారు. మొత్తం ఆరింటిలో ఇప్పటి వరకు రెండు భవన నిర్మాణాలు మాత్రమే 80 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 4 భవనాలు నిర్మాణాలకు నోచుకోవడం లేదు.

పల్లె దవాఖానాల్లో వైద్యుల కరువు..

బచ్చన్నపేట మండలంలో పల్లె దవాఖానాలు పనిచేయడం లేదు. ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించాల్సిన పల్లె దవాఖానాల్లో వైద్యులు లేకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తున్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదనే విమర్శులు ఉన్నాయి. దీంతో లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ వైద్య శాలలు అలంకార ప్రాయంగా మారాయి. ఏఎన్ఎమ్ లతో దవాఖానాలు నడిపిస్తున్నారు. పల్లె దవాఖానాల్లో ఒక డాక్టర్‌, ఫస్ట్‌ ఏఎన్‌ఎం, సెకండ్‌ ఏఎన్‌ఎంను స్టాఫ్‌గా నిర్ధారించారు. ఎంబీబీఎస్‌ వైద్యులు లేనిచోట మిడిల్‌ లెవల్‌ హెల్త్‌ ప్రోవైడర్‌ ను నియమించారు. బీఎస్సీ నర్సింగ్‌, బీఏఎంఎస్‌ అభ్యర్థులను వైద్యులుగా ఎంపిక చేస్తున్నారు. వారు పట్టణాల్లో ప్రభుత్వ నియామకాల్లో ఎంపిక కావడంతో కొందరు వెళ్లి పోతున్నారు. మరికొందరు పీజీ సీట్లు రావడంతో రిజైన్‌ చేస్తున్నారు. కానీ కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాలేదన్న సాకుతో వేతనాలు నిలిపివేస్తుండటంతో వైద్యులు ఆందోళన చేయాల్సిన పరిస్ధితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది పల్లె దవాఖానాల్లో పనిచేయ డానికి సుముఖత చూపడం లేదు. దీంతో జలుబు, జ్వరం, ఫ్లూ లక్షణాలు ఉన్న వారికి పల్లెదవాఖానాల్లో మందులు అందిస్తున్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన వారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి, ప్రాంతీయ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా పల్లె దవాఖానాలో వైద్య సిబ్బందిని నియమించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడేలా వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News