Charlapalli: వెయిటింగ్ లేని రైలు జర్నీ..! అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్

అన్నింటా అంతర్జాతీయ ప్రమాణాలు.. విమనాశ్రయాలను తలపించేలా నిర్మాణం.. అధునాతన సౌకర్యాల ఏర్పాటు.. ఫుడ్ కోర్టులు.. రెస్టారెంట్లు.. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది.

Update: 2024-12-22 02:38 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : అన్నింటా అంతర్జాతీయ ప్రమాణాలు.. విమనాశ్రయాలను తలపించేలా నిర్మాణం.. అధునాతన సౌకర్యాల ఏర్పాటు.. ఫుడ్ కోర్టులు.. రెస్టారెంట్లు.. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. నగరంలో రైల్వే ప్రయాణికుల సేవల్లో నాలుగో టెర్మినల్‌గా చర్లపల్లి స్టేషన్‌ను తీర్చిదిద్దారు. రూ.430 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్టును తలదన్నెలా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్, బొగ్గుగనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. స్టేషన్ పనులను మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, రైల్వే ఉన్నతాధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ప్రారంభోత్సవ వేళ అధికార యంత్రంగానికి ఈటల పలు సూచనలు చేశారు.

వెయిటింగ్ లేని జర్నీ..

స్వాతంత్ర్యానికి పూర్వం జంటనగరాల్లో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లను నిర్మించారు. ఈ మూడు స్టేషన్ల ద్వారా రోజుకు 227 రైళ్లు సేవలు అందిస్తున్నాయి. లక్షలాది రైల్వే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ మూడు ప్రధాన స్టేషన్లపై విఫరీతమైన ప్రయాణికుల రద్దీ ఉంటుంది. కాగా 1874లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ స్టేషన్ అతిపెద్దతి. పది ప్లాట్ ఫామ్స్‌తో ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్ ఖాళీ లేకపోవడంతో అనేక రైళ్లు గంట వరకు అవుటర్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1907లో నిర్మించిన నాంపల్లి స్టేషన్ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినా..సికింద్రాబాద్ మీదుగా రైళ్ల రాకపోకలు చేయాల్సి రావడంతో సికింద్రాబాద్‌కు ఒత్తిడి తగ్గలేదు. అదేవిధంగా 1916లో నిర్మించిన కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ఇటివల కాలంలో రైళ్లు మళ్లించారు. అయితే ఎక్కువ రైళ్లు మౌలాలి, మల్కాజ్‌గిరి మీదుగా మళ్లించడం వల్ల మౌలాలి స్టేషన్ అవుటర్‌లో రైళ్లు నిలిచిపోవలసి ఉంటుంది. సికింద్రాబాద్‌కు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఈ మూడు స్టేషన్లపై గణనీయ సంఖ్యలో తగ్గిపోనుంది. చర్లపల్లి నుంచే నగరం నలుమూలలకు ప్రయాణికులు సులువుగా చేరుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా మరో 25 జతల ట్రైన్స్ ఇక్కడి నుంచి పరుగులు తీయనున్నాయి. దీంతో ప్రజా రవాణా మెరుగుకు మరింత ఉపక్రమిస్తోంది.

ఎయిర్‌పోర్ట్ తరహా హంగులు..

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో రైల్వే ప్రయాణికుల కోసం ఆధునిక వసతులను ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎలాగైతే ఉంటాయో. అలా వసతులతో నిర్మించారు. స్టేషన్‌లో నాలుగు అదనపు హై లెవల్ ఫ్లాట్ ఫామ్‌లు నిర్మించారు. ఇప్పటికే ఉన్న 5 ఫ్లాట్ ఫామ్‌లకు అదనంగా మరో 4 ఫ్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిప్ట్‌లు, ఆరు బుకింగ్ కౌంటర్లు, పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు హైక్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ లాంటివి ఏర్పాటు చేశారు. మొదటి అంతస్థులో కెఫెటేరియా, రెస్టారెంట్, టాయిలెట్ల వంటివి ఏర్పాటు చేశారు. కొత్త డిజైన్‌లో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా విశాలమైన స్థలం (కన్ కోర్స్), ముందు వైపు ప్రశాంతమైన లైటింగ్‌తో కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎలివేషన్‌ను తీర్చిదిద్దారు. టెర్మినల్ మొదలైతే ప్రయాణికులకు ఉచితంగా వైఫై సదుపాయం కల్పించనున్నారు. రెండు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఇందులో ఒకటీ 12 మీటర్ల వెడల్పు, మరొకటి 6 మీటర్ల వెడల్పులో నిర్మించారు. వీటికి తోడు ఒక ఎయిర్‌కండిషన్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. దేశంలో ఇది రెండో ఎయిర్ కండిషన్ వెయిటింగ్ హాల్‌గా చర్లపల్లి టెర్మినల్ చరిత్ర సృష్టించబోతుంది.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా..

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాలపిట్ట, బతుకమ్మ, గోల్కొండ, చార్మినార్ చిత్రాలను తీర్చిదిద్దారు. అలాగే మహిళల వెయిటింగ్ హాల్‌లో వివిధ రకాల మహిళ చిత్రకళలు దర్శనమివ్వనున్నాయి. స్టార్ హోటల్‌ను తలపించేలా రెస్టారెంట్, ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఫుడ్ కోర్టులను తీర్చిదిద్దారు. సికింద్రాబాద్‌కు తూర్పువైపు ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఉత్తర భారతంలోని న్యూ ఢిల్లీ, ఆయోధ్య, వారణాసి తదితర ప్రాంతాల రైళ్ల కనెక్టివిటి ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వెళ్లనవసరం లేకుండానే చర్లపల్లిలో రైళ్లను నిలిపేలా రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మాదిరిగా ఇక్కడ కూడా కోచ్‌ల నిర్వహణ సౌకర్యాలు కల్పించారు.

రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఈటల..

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్వే స్టేషన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్, బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలు ఈ నెల 28న ప్రారంభించనున్న నేపథ్యంలో ఎంపీ ఈటల రాజేందర్ శనివారం సందర్శించారు. స్టేషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లును పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణను అంగరంగ వైభవంగా నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేంద్రం రూ.500 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో స్టేషన్‌ను నిర్మించినట్లు ఈటల వెల్లడించారు.

Tags:    

Similar News