Formula E-Race: ‘ఫార్ములా ఈ-కారు రేస్’ ఇష్యూలో సీన్ రివర్స్! ఖంగుతిన్న బీఆర్ఎస్
‘అనుకున్నదొక్కటి.. అయింది ఒక్కటి..’ అన్నట్లుగా మారింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.
దిశ, తెలంగాణ బ్యూరో: ‘అనుకున్నదొక్కటి.. అయింది ఒక్కటి..’ అన్నట్లుగా మారింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అందులోనూ ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ మరోసారి గందరగోళంలో పడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా కేసీఆర్, ఆ పార్టీ నేతలు షాక్ అయ్యారు. ఈడీ వివరాలు అడగడం.. ఆ వెంటనే ఎన్ఫోర్స్మెంట్కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేయడంతో అందరూ ఖంగుతున్నారు. 30వ తేదీ వరకు ఏసీబీ అరెస్టు చేయొద్దంటూ హైకోర్టులో రిలీఫ్ లభించిందని అనుకుని ఆనందిస్తున్న తరుణంలో ట్విస్టు ఇస్తూ ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది.
బీఆర్ఎస్ ‘ఫార్ములా’కు ఈడీ బ్రేక్
ఫార్ములా ఈ-కారు కేస్ విషయంలో కేటీఆర్‌పై కాంగ్రెస్ కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. సానుభూతి పొందాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. పార్టీతో పాటు, కేటీఆర్ సైతం అదే వ్యూహంతో ఉన్నారు. కానీ.. అనుకోకుండా ఒక్కసారిగా ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఇప్పటివరకు ఎంతో కొంత రాజకీయ ప్రేరేపిత కేసుగా దీనిని నమ్ముతూ వచ్చినా.. తాజాగా ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవర్గాలకు చెందిన వారిపైనా ఈడీ కేసు నమోదు చేయడంతో ఈ కేసు రాజకీయ ప్రేరేపితం కాదనే కోణంలో ఆలోచించడం మొదలు పెట్టారు.
ఈడీ అంత అషామాషీగా కేసు నమోదు చేయదని, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయనే విషయం ఉంటేనే కేసు పెడుతుందని చర్చ జరుగుతున్నది. కేటీఆర్కుఇప్పటివరకు పట్టణాల్లో ఉన్న కాస్త ఇమేజ్కూడా ఈడీ కేసుతో మసకబారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫార్ములా–ఈ కేసు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడుతున్న తీరును కూడా పలువురు తప్పుపడుతున్నారు. టీవీల్లో, ప్రెస్మీట్లలో మాట్లాడిన భాష, పదాలతో ఆయనపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఈ కేసుపై తానే నిధులు మళ్లించానని చెప్పిన కేటీఆర్.. పార్టీ నాయకులు మాత్రం రాజకీయ కక్ష సాధింపు అనడంపై అభ్యంతరం చెబుతున్నారు.
కేసీఆర్‌కు మరో క్షోభ తప్పదా?
మరోవైపు.. ఈడీ కేసులు అంత సులువుగా ఉండవని ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మిగిలిన విచారణ సంస్థల కేసుల్లో అభియోగాలు మోపిన వ్యక్తి ఎందుకు నిందితుడో ఆ సంస్థలు నిరూపించాల్సి ఉంటుంది. కానీ.. ఈడీ కేసులు ఇందుకు పూర్తిగా భిన్నం. అభియోగాలు మోపిన వ్యక్తి తాను ఎందుకు నిందితుడిని కాదో నిందితుడే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక్క కారణంతో ఈడీ కేసులు ఎందుకు కఠినమో చెప్పవచ్చని అంటున్నారు. ఈడీ కేసులోనే ఇప్పటికే కేసీఆర్కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చారు. దాదాపు ఆరు నెలలపాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తండ్రిగా కేసీఆర్మానసిక క్షోభను అనుభవించాల్సి వచ్చింది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినా.. తండ్రిగా కూతురు జైల్లో ఉండటంతో ఎంతో మానిసిక వ్యధకు గురయ్యారని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. తాజాగా.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేయడం మరోసారి కేసీఆర్ మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుందేమోననని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈడీ కేసులు సుదీర్ఘకాలం సాగడమే కాకుండా అంతర్గతంగా ఏమి జరుగుతుందో కూడా అంత సులువుగా తెలియదు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను అరెస్ట్‌చేసి ఢిల్లీ తిహర్జైలుకు తరలించాల్సి ఉంటుందని, అక్కడ రాజకీయంగా సానుభూతి పొందడం అంత సులువు కాదని చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్రం.. మరోవైపు కేంద్రం.. ఇలా ఇద్దరూ ఒకేసారి మూకుమ్మడిగా బీఆర్ఎస్, కేసీఆర్కుటుంబంపై దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్‌లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందో.. ఎలాంటి మార్పులు సంభవిస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయోనని చెబుతున్నారు.