బీజేపీకి కలిసిరాని ఖమ్మం.. వరుసగా మూడోసారీ నిరాశే!
బీజేపీకి ఖమ్మం జిల్లా కలిసొచ్చేలా కనిపించడంలేదు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీకి ఖమ్మం జిల్లా కలిసొచ్చేలా కనిపించడంలేదు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. గతంలో పొంగులేటి శ్రీనివాస్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగిన సమయంలో తమ సత్తా ఏంటో చూపించుకోవాలని బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది. తీరా పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరడంతో అది వాయిదా పడింది. అనంతరం పార్టీ ఎక్కడైతే వీక్‌గా ఉందో అక్కడే తమ సత్తా చాటుకోవాలని మరోసారి అమిత్ షా భారీ బహిరంగ సభను నిర్వహించాలని, తామేంటో నిరూపించుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం చేపట్టారు. తీరా చివరి క్షణంలో గుజరాత్‌లో బిఫర్ జాయ్ తుపాన్ ఎఫెక్ట్ కారణంగా సభ రెండోసారి వాయిదాపడింది.
కాగా, ఈనెల 29వ తేదీన సభ ఉంటుందని తెలిపారు. సభకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లు సైతం చేపట్టారు. కిషన్ రెడ్డి సమీక్ష సైతం నిర్వహించారు. కానీ వర్షాల కారణంగా సభ కష్టమని భావించి టూర్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. షా రాకకు సంబంధించి షెడ్యూల్ సైతం ఖరారైంది. ఈ టూర్‌లో పలువురు ప్రముఖులతో భేటీ కావడంతో పాటు త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారని అందరూ భావించారు. అంతేకాకుండా పార్టీ ప్రెసిడెంట్ మార్పు తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలపై, ధిక్కార స్వరాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అనుకున్నారు.
కానీ, చివరకు తెలంగాణలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడోసారి పర్యటన సైతం వాయిదా పడింది. దీంతో సభ నిర్వహణపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని బీజేపీ శ్రేణులు స్పష్టంచేశాయి. ఖమ్మంలో బలోపేతమవుదామనుకున్న పార్టీకి నిత్యం ఏదో ఒక రూకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లో అయినా సభ నిర్వహణకు అడ్డంకులు తొలుగుతాయా లేదా? అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా షెడ్యూల్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే టూర్ ను వాయిదా వేయడం గమనార్హం.