కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ట్వీట్ వార్.. వామ్మో కౌంటర్ ఏటాక్‌లో ఆ పార్టీ తగ్గేదేలే..!
మేడారం జాతర నిర్వాహణ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం జాతర నిర్వాహణ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్వీట్టర్ వేదికగా వరుసగా ట్వీట్లు చేస్తూ పార్టీలు కౌంటర్లు ఇచ్చుకుంటున్నాయి. తాజాగా మేడారం జాతరకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. ‘అరకొర సౌకర్యాలతో మేడారంలో భక్తుల అవస్థలు. సమ్మక్క - సారక్క సాక్షిగా ముఖ్యమంత్రి ముందే సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు’ అంటూ బీఆర్ఎస్ పార్టీ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
ఏడ్సుడు.. ఎడిటింగ్లు తప్ప ఏమొస్తది మీకు?
‘ఏడ్సుడు.. ఎడిటింగ్లు తప్ప ఏమొస్తది మీకు?’ అని కాంగ్రెస్ కౌంటర్ ట్వీట్ చేసింది. తెలంగాణను ప్రేమించే సద్బుద్ధిని సమ్మక్క-సారక్క తల్లులు మీకు ప్రసాదించాలని కోరుకుంటూన్నాని పేర్కొన్నారు. ‘సరే.. మీ కోసం ఎడిట్ చేయని వీడియోలు’ అని మరో వీడియో ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న వీడియో కౌంటర్‌గా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘సంతోషం.. నిజం ఒప్పుకున్నారు.. అంటే అది ఎడిటింగ్ అని ఒప్పుకున్నారు.’ అని బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చింది.
ఆమె భాష చూశారా?
‘మీరు ఏర్పాటు చేసిన మనిషే మీరు చెప్పినట్లు మాట్లాడలే..! ఆమె భాష చూశారా? భక్తురాలి నోట అలాంటి మాటలేనా వచ్చేది. పోనీ మీ ప్రకారమే చూసినా.. ఏర్పాట్ల గురించా ఆమె మాట్లాడింది? ఆమె ఏమంటుంది. సీఎం వస్తే మేం ఆగాల్నా.. మాకు మల మూత్రాలు వస్తే సంగతేంటి అని అడిగింది. వస్తె వెళ్లమ్మ అక్కడ ఏర్పాట్లు చేశాం అని పోలీసులు ముద్దుగా చెప్తే.. మీ బతుకుల మన్నువడ అని ఆమె తిట్టవట్టే. అయినా పోలీసులు అంత నిమ్మళంగా ఆమెకు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి’ అని కాంగ్రెస్ పేర్కొంది.