మియాపూర్‌లో తీవ్ర విషాదం.. శ్రీ చైతన్య కాలేజీలో ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణం
విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు విగత జీవులుగా మారుతున్నారు.
దిశ, శేరిలింగంపల్లి: విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు విగత జీవులుగా మారుతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యాల చదువుల ఒత్తిడి, మార్కుల టెన్షన్‌తో వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ (17) మియాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడే హాస్టల్ గదిలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, విద్యార్థి ఆత్మహత్యను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు శ్రీ చైతన్య కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారని, మానసికంగా వేధించడం వల్లే వారు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని నవ తెలంగాణ విద్యార్థి శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవన్ ఆరోపించారు. వెంటనే కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థి మృతిపై అనేక అనుమానాలు..
విద్యార్థి కౌశిక్ రాఘవ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నపాటి తాడుతో ఉరి వేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం చెబుతుంది. కానీ, ఉరి వేసుకున్నట్లుగా చెబుతున్న తాడు మరీ సన్నగా ఉండడం, అదీ కూడా చిన్నగా ఉండడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థి రాత్రి ఎప్పుడో మృతి చెందితే.. తెల్లవారుజామున 6 గంటలకు యాజమాన్యం గుర్తించడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మృతి చెందిన విద్యార్థినిని హుటాహుటిన ఎవరికీ తెలియకుండా అంబులెన్స్‌లో కాకుండా బైక్‌పై ఆస్పత్రికి తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా మార్చురీకి తరలించడం పట్ల మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడుతున్నారు.