Huzurabad: కారు ఢీకొని హెల్త్ అసిస్టెంట్ మృతి..
కారు ఢీకొని ఓ హెల్త్ అసిస్టెంట్ మృతి చెందిన సంఘటన హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ చౌరస్తాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
దిశ, హుజురాబాద్ రూరల్: కారు ఢీకొని ఓ హెల్త్ అసిస్టెంట్ మృతి చెందిన సంఘటన హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ చౌరస్తాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.... హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ కు చెందిన వకులాభరణం రమేష్ (53 )అనే హెల్త్ అసిస్టెంట్ కూరగాయలు కొనుగోలు చేసుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. సైదాపూర్ చౌరస్తా నుంచి తన నివాసమైన విద్యానగర్ కు ద్విచక్ర వాహనాన్ని తిప్పుతుండగానే కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి రమేష్ బైకు ని ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న మురికి కాలువలో రమేష్ పడిపోయాడు. తీవ్ర గాయాలైన రమేష్ ను స్థానికులు 108 వాహనంలో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. అప్పటికే రమేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దామెర గ్రామ సబ్ సెంటర్లో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అలాగే ఖాళీ సమయంలో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది.మృతుని భార్య గత ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.