ఆరు గంటల నుండి అంబులెన్స్ లోనే మృతదేహం..
ఉన్న ఆస్థి పాస్తులు నా అనుకున్న వాళ్లకు పంచిన వృద్ధురాలు ఆఖరి ఘడియల్లో అందరికీ భారంగా మారింది.
దిశ, జగిత్యాల ప్రతినిధి : ఉన్న ఆస్థి పాస్తులు నా అనుకున్న వాళ్లకు పంచిన వృద్ధురాలు ఆఖరి ఘడియల్లో అందరికీ భారంగా మారింది. మృతి చెందిన ఆరు గంటలు కావస్తున్నా మృతురాలి బంధువులు పట్టించుకోకపోవడంతో అనాథలా అంబులెన్స్ లోనే విగతజీవిగా పడి ఉంది. ఈ అమానవీయ ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకోగా అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల పట్టణానికి చెందిన సాదుల సత్తమ్మ (85) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా సత్తమ్మకు వారసులు ఎవరూ లేకపోవడం భర్త లక్ష్మణ్ 20 ఏళ్ల క్రితం మృతి చెందడంతో సమీప బంధువుల ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో సత్తమ్మ తన పేరున ఉన్న ఆస్తితో పాటు సొంతింటిని మొత్తం బంధువుల కుమారులైన ఇద్దరు అన్నదమ్ములకు సమానంగా పంచింది.
అయితే మంగళవారం సత్తమ్మ మరణించడంతో తమ ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ బంధువులు ఎవరు మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిన బంధువులు కనీసం సత్తెమ్మ ఇచ్చిన ఇంటిలో కూడా శవాన్ని ఉంచేందుకు అంగీకరించలేదు. దీంతో సొంత ఇళ్లు ఉన్నా కూడా సత్తెమ్మ మృతదేహం అంబులెన్స్ లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం దూర ప్రాంతాల నుండి వచ్చే బంధువులు అంత్యక్రియలు చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఈ ఘటన పై సమాచారం అందుకున్న జగిత్యాల పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.