Tragedy:జిల్లాలో తీవ్ర కలకలం.. ఒకే చెట్టుకు ఉరి వేసుకుని దంపతుల ఆత్మహత్య

ఒకే చెట్టుకు దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తిరుపతి జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది.

Update: 2024-12-25 13:07 GMT

దిశ, చంద్రగిరి: ఒకే చెట్టుకు దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తిరుపతి జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి ‌జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయితీ కూచువారిపల్లిలో లత (45) సురేంద్ర నాయుడు (50) దంపతులు తమ జీవనం గడుపుతున్నారు. కాగా తిరుపతిలో విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్ గా సురేంద్ర నాయుడు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారైలు ఇద్దరికి వివాహమై అమెరికాలో స్థిరపడ్డారు.

ఇది ఇలా ఉండగా హఠాత్తుగా సురేంద్ర నాయుడు, లత దంపతులు వారి మామిడి తోపులో ఒకే చెట్టుకు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకొని విగత జీవులుగా కనపడటంతో ఒక్కసారిగా గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సీఐ శివరామిరెడ్డి మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలకు తరలించారు. దంపతుల ఆత్మహత్య గల కారణాలు తెలియ రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం మేరకు సురేంద్ర నాయుడుకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలు లేవని చెప్పడం గమనార్హం.


Similar News