పని కోసం వచ్చిన వ్యక్తి దారుణ హత్య.. డెడ్ బాడీ పార్శిల్ కేసులో సంచలన విషయాలు
డెడ్ బాడీ పార్శిల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి...
దిశ, వెబ్ డెస్క్: డెడ్ బాడీ పార్శిల్ కేసు(Dead Body Parcel Case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు నిందితుడు శ్రీధర్ వర్మ(Accused Sridhar Varma)ను పోలీసులు అదుపులోకి విచారించారు. పార్మిల్‌లో ఉన్న డెడ్ బాడీ.. పని కోసం వచ్చిన పర్లయ్యదని నిందితుడు తెలిపారు. ఆస్తి కోసం తన వదినను బెదిరించేందుకే పర్లయ్యను చంపి డెడ్ బాడీ పార్శిల్ చేసినట్లు చెప్పారు. తనకు ముగ్గురు భార్యలని, రెండో భార్య అక్క తులసమ్మ ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. తమ మధ్య కొంత కాలంగా ఆస్తి వివాదం నడుస్తోందని, పర్లయ్య హత్యను చేసి డెడ్ బాడీని పార్శిల్ ద్వారా తన వదినకు పంపితే భయపడుతుందని తను భావించినట్లు తెలిపారు. అయితే ఈ హత్యలో మూడో భార్య ప్రమేయం ఉన్నట్లు కూడా శ్రీధర్ వర్మ చెప్పారు. అయితే పని కావాలని పర్లయ్యతో పాటు మరో వ్యక్తి కూడా వచ్చారని పేర్కొన్నారు. మరో వ్యక్తికి కుటుంబ సభ్యులు ఉన్నారని, పర్లయ్యకు ఉన్నా పట్టించుకోరని, పెద్దగా అనుమానం రాదని హత్య చేసినట్లు తెలిపారు.
అయితే విచారణలో నిందితుడు చెప్పిన సమాధానాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసం సంబంధం లేని వ్యక్తిని శ్రీధర్ వర్మ ఎందుకు చంపారనే కోణంలో నిందితుడికి విచారించారు. కానీ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. అలాగే నిందితుడి వద్ద మరో శవ పేటిక ఉండటంపైనా అనుమానం వ్యక్తమయ్యాయి. ఎవరికోసం ఈ శవ పేటిక రెడీ చేశారనే కోణంలోనూ నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తు్న్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో జరిగిన ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.