సిరిసిల్ల జిల్లాలో పెరిగిన కేసులు

జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కేసులు పెరిగాయి.

Update: 2024-12-24 13:35 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కేసులు పెరిగాయి. గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులే అత్యధికంగా నమోదు అయ్యాయి. మంగళవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 2024 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో హత్య కేసులు గణనీయంగా తగ్గాయని, దొంగతనం, గంజాయి కేసులు కొద్దిగా పెరిగాయని, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ సిస్టంను పాటిస్తూ స్టేషన్ కు ఫిర్యాదులు రాగానే వెంటనే స్పందించి కేసులు నమోదు చేసి తర్వాత విచారిస్తున్నామని తెలిపారు.

పెరిగిన గంజాయి దొంగతనం కేసులు

ప్రతి చిన్న దొంగతనానికి కూడా కేసు నమోదు చేసి, నేర ప్రవృత్తి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించడం వలన గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేసుల సంఖ్య రెట్టింపు అయిందన్నారు. సుమారు 220 కేసులు నమోదు చేశామని, సుమారు 250 మందిని గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.

    గత రెండు మూడు నెలల నుండి గంజాయి వాడకం దారులను గుర్తించి డీఎస్పీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని, ఇప్పటివరకు సుమారు తొంభై మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి అమ్మకం దారులు, సరఫరాదారులపై దృష్టి సారించడం జరిగిందన్నారు. మళ్లీ జిల్లాకు సరఫరా జరగకుండా చూడడానికి కృషి చేస్తున్నామన్నారు.

సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి

సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సాధించామని ఎస్పీ తెలిపారు. 85 శాతంను రికవరీ సాధించి సుమారు మూడు కోట్ల వరకు రికవరీ చేశామన్నారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో, పోలీసు వేషధారణలో వీడియోలో కనబడి నేరాలకు పాల్పడుతున్నరని, ఇలాంటి వారి వలలో పడి బయపడి మోసపోవద్దని సూచించారు. జిల్లాలో ఓ విద్యావంతుడు షేర్ మార్కెట్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అత్యధికంగా తొంభై లక్షలు పోగొట్టుకున్నాడని, ప్రజలు సైబర్ క్రైమ్ లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సంవత్సరంలో అత్యధికంగా 77 కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడేలా కష్టపడ్డామని తెలిపారు.

ఆపరేషన్ అక్క కార్యక్రమంతో లైంగిక దాడులకు చెక్

లైంగిక దాడులకు చెక్ పెట్టడానికి ఆపరేషన్ అక్క కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని ఎస్పీ అన్నారు. ఆపరేషన్ అక్క అనే కార్యక్రమంతో జిల్లాలోని ప్రతి మండల పోలీస్ స్టేషన్లో ఒక మహిళ పోలీస్ అధికారిని నియమించామని, వారు ఆయా మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలపై ప్రత్యేక నిఘా వించుతారన్నారు.

     విద్యార్థిని విద్యార్థులు వారికి సమాచారం అందిస్తే అబలలపై జరుగుతున్న లైంగిక దాడులను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని తెలిపారు. అంతేకాకుండా మహిళల రక్షణ విషయంలో షీ టీం బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వివరించారు. పాఠశాల విద్యార్థినులకు గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ పై అవగాహన కల్గించడం వలన రెండు కేసులు నమోదు చేశామన్నారు. దాంతోపాటు జిల్లాలో నేర ప్రవృత్తి తగ్గించడానికి పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Similar News