Secunderabad: ప్లీజ్.. ఒక్క ఛాన్స్..! నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు

నామినేటెడ్ పదవులపై అధికార పార్టీ నేతలకు అశలు చిగురిస్తున్నాయి.

Update: 2024-11-23 02:55 GMT

దిశ, కంటోన్మెంట్ : నామినేటెడ్ పదవులపై అధికార పార్టీ నేతలకు అశలు చిగురిస్తున్నాయి. గ్రేటర్ లో అధికార పార్టీ గెలుపొందిన ఏకైక కంటోన్మెంట్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌తో పాటు మంత్రులు, ముఖ్య నేతలను కలుస్తూ అవకాశం ఇవ్వాలని అశావహులు వేడుకుంటున్నారు. నియోజకవర్గంలో కీలకమైన బోయిన్‌పల్లి మార్కెట్ చైర్మన్ పదవితో పాటు ఆలయ పాలక మండలి కమిటీలను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం గత అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమి పాలైన గద్దర్ కుమార్తె వెన్నెలకు మాత్రమే రాష్ట్ర సాంస్కృతిక చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టారు.

ఏఎంసీ చైర్మన్‌కు పోటీ..

బోయిన్ పల్లి కూరగాయాల మార్కెట్ రాష్ట్రంలోనే అతి పెద్దది. ఈ మార్కెట్ చైర్మన్ పదవీ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఏఎంసీ చైర్మన్ పదవిని న్యూ, ఓల్డ్ బోయిన్ పల్లిలకు చెందిన ఆనంద్ గౌడ్, దండుగుల యాదగిరి ఆశిస్తున్నారు. ఆనంద్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు అత్యంత సన్నిహితుడు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మైనంపల్లితో పాటు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా గత ప్రభుత్వ హయాంలో ఆనంద్ గౌడ్ సతీమణి హారిక ఇదే మార్కెట్ కు తాజా మాజీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల వల్ల హారిక చైర్‌పర్సన్‌గా చాలా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే ఈసారి మార్కెట్ చైర్మన్ ఓసీకి రిజర్వుడ్ కావడంతో తన సన్నిహితుడైన అనంద్‌గౌడ్‌కే చైర్మన్ పదవిని ఇప్పించుకునేందుకు మైనంపల్లి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే దండుగుల యాదగిరి సీనియర్ కాంగ్రెస్ నేత, కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం అధిష్టానం పెద్దలను కలుస్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గతంలోనే ప్రకటించాల్సిన మార్కెట్ పాలక వర్గం నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఆలస్యమవుతూ వస్తోంది. అయితే మైనంపల్లి యాదగిరితో మాట్లాడి మరోసారి అవకాశం ఇప్పిస్తానని ఒప్పించి, ఆనంద్‌గౌడ్‌కు సహకరించాలని కోరినట్లు సమాచారం. దీంతో అనంద్ గౌడ్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

ఆలయాల పాలక మండళ్లకు..

కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘శ్రీ గణపతి దేవాలయం’ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. ఈ టెంపుల్ చైర్మన్ పదవీ కోసం ప్రతి సారి తీవ్ర పోటీ నెలకొని ఉంటుంది. అదే స్థాయిలో మారేడ్ పల్లిలోని సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పదవి కోసం అశావహులు పోటీ పడుతుంటారు. మిగితా కాశీ విశ్వనాథ టెంపుల్, పికెట్‌లోని ప్రసన్నాంజనేయ, శ్రీ అంజనేయ స్వామి దేవాలయాలు, బొల్లారంలోని అంజనేయ స్వామి ఆలయం, పాండు రంగ విఠలేశ్వర ఆలయం, రాజు కరం గంగా ధర్మ శాల, సంతోషీమాత ఆలయాలకు పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. అయితే కొనేరు (పేరుమాల్) వెంకటేశ్వర స్వామి ఆలయం పాలక మండలి మూడేళ్ల పాటు కోర్టు స్టే ఉండడంతో ఆ పాలక మండలిని కొనసాగించనున్నారు. మిగితా దేవాలయాల పాలక వార్గాల పదవులు దక్కించుకునేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Tags:    

Similar News