కనీసం డీటెయిల్స్ చెప్పని లీడర్లు.. క్షేత్రస్థాయిలో గందరగోళంగా BRS పరిస్థితి!

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది అయినా మార్పు రావడం లేదు.

Update: 2024-12-25 02:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది అయినా మార్పు రావడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్టీ సీనియర్ నేతలను, కార్పొరేషన్ మాజీ చైర్మన్లను కలుపుకొనిపోవడం లేదు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల వివరాలు సైతం చెప్పడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఏ హోదాలో జనసమీకరణ చేయాలి? పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలి.. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనే అంశం తెలియక సతమతమవుతున్నారు. పార్టీ కమిటీలు వేసి తమకు అవకాశం కల్పిస్తే పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా నిర్వహిస్తామని లీడర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ స్తబ్దుగా పార్టీ కేడర్ ఉంది.

స్థానిక ఎమ్మెల్యేలనే ‘సుప్రీం’ చేసిన కేసీఆర్

ఉద్యమ సమయం నుంచి పార్టీతోనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పదవులు లేకపోయినా పార్టీని రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేశారు. కొంతమందికి పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ పదవులతో పాటు కార్పొరేషన్ పదవులు సైతం అప్పగించారు. అయినప్పటికీ ఇంకా కొంతమందికి పదవులు రాలేదు. అయినా భవిష్యత్‌లో వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైంది. కాగా, పార్టీ కమిటీల్లోనైనా పదవులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ పార్టీకోసం పనిచేసేవారికి గుర్తింపు తప్పక లభిస్తుందని పదేపదే చెబుతున్నప్పటికీ కమిటీలపై దృష్టి సారించలేదు. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానిక ఎమ్మెల్యేలనే సుప్రీంను చేశారు. పార్టీ నియోజకవర్గ కమిటీలు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్యేలకే అప్పగించారు. దీంతో అసలు సమస్య మొదలైంది. మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలే ఇప్పటికీ పార్టీ ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. రెండో వ్యక్తి నియోజకవర్గంలో కీలకంగా , ప్రత్యామ్నాయంగా మారకుండా జాగ్రత్తపడ్డారు. ఎవరైనా యాక్టివ్‌గా పనిచేస్తే పార్టీ నుంచి వెళ్లగొట్టడం, లేకపోతే ఏదైనా అపవాదుతో పార్టీకి దూరం చేశారని ఇప్పటికే కొంతమందిపై ఆరోపణలున్నాయి. దీంతో వారు మాత్రం ఆ నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతలను, కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసిన వారిని కలుపుకుపోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చే కార్యక్రమాల వివరాలు సైతం చెప్పడం లేదని, అలాంటప్పుడు ఎలా పార్టీ కార్యక్రమాలో పాల్గొనాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అభద్రతాభావంతోనే..!

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసి ప్రజల నుంచి ఆదరణ ఉన్నవారు ఉన్నారు. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల్లో అభద్రతాభావం పెరుగుతుందనేది స్పష్టమవుతోంది. పార్టీ నేతలను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనకుండా చేస్తు్న్నారనే ప్రచారం జరుగుతోంది. వారికి పార్టీ కార్యక్రమాలు చెబితే యాక్టివ్ అవుతారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతారని జంకుతున్నట్టు సమాచారం. టికెట్ తనకు రాకుండా అవుతుందని భావించి రాజకీయ వ్యూహంలో భాగంగానే ముందస్తుగా సీనియర్ లీడర్లు, కార్పొరేషన్లకు చైర్మన్‌లుగా పనిచేసినవారి పక్కకు పెడుతున్నారని పార్టీ నేతలే బహిరంగంగా అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి జిల్లా నేతల భేటీలకు సైతం నో ఇన్ఫో..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో, కేటీఆర్ సైతం ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ మీటింగులకు సైతం మాజీ మంత్రులుగా పనిచేసి జిల్లా ఇన్‌చార్జీలుగా ఉన్నవారు పార్టీ సీనియర్ నేతలకు సమాచారం ఇవ్వలేదు. దీంతో కొందరు లీడర్లు మీడియాకు సమాచారం ఇవ్వడంతో పాటు సోషల్ మీడియా వేదికగా పార్టీ సీనియర్ నేతల తీరును ఎండగట్టిన సందర్భాలున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన పార్టీ ఇన్‌చార్జీలు.. పనిచేస్తున్నవారే పార్టీని భ్రష్టుపటిస్టున్నారని, మరింతగా పార్టీ బలహీన మయ్యేందుకు వారి వ్యవహారశైలినే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఇంకా ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని విశ్వసనీయ సమాచారం.

గులాబీ ఇన్‌చార్జీలకు చెక్ పడేనా..?

అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌చార్జీలతో పాటు కొంతమంది జిల్లా ఇన్‌చార్జీలకు చెక్ పెట్టాలంటే పార్టీ కమిటీలు అనివార్యంగా మారాయి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తే అందులో యాక్టివ్‌గా పనిచేసేవారికి అవకాశం దక్కనుంది. దీనికి తోడు యువతకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే పార్టీ అధినేత ప్రకటించారు. మరో 30, 40 ఏండ్ల వరకు పార్టీని పటిష్టం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో యువతకు పార్టీ పదవులు ఇస్తే.. ఇప్పుడు ఏకపక్షంగా, వర్గాలను ప్రోత్సహిస్తున్న ఇన్‌చార్జీలకు చెక్ పడనుందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

‘స్థానిక’ నేతలకు భరోసా కల్పించడంలో విఫలం

వరుస ఓటములతో గులాబీ పార్టీ కింది స్థాయి నేతలు, కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. మరోవైపు గ్రామస్థాయిలో యాక్టివ్‌గా పనిచేసేవారిని ఇన్‌చార్జీలు అక్కున చేర్చుకోకపోవడంతో నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది స్థానిక పరిస్థితులను బట్టి అధికార పార్టీలోకి వెళ్తున్నారు. అలాంటివారికి భరోసా ఇచ్చి పార్టీలో ఉండేలా చర్యలు చేపట్టడంలో ఇన్‌చార్జీలు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ తీరు ఇలాగే ఉంటే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గడ్డుకాలమే ఎదురయ్యే పరిస్థితులు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లుందనేది కీలకం కానుంది.

Tags:    

Similar News