గ్రూప్-4 నియామకాలతో పాత వీఆర్‌వోలకు కష్టాలు.. మారుతున్న హోదాలు

రాష్ట్రంలోని వేర్వేరు శాఖల్లో రీడెప్లాయ్ చేసిన పూర్వ వీఆర్‌వోల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది.

Update: 2024-11-23 02:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వేర్వేరు శాఖల్లో రీడెప్లాయ్ చేసిన పూర్వ వీఆర్‌వోల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు టీజీపీఎస్సీ గ్రూప్గ్రూప్-4 నియామకాలతో పాత వీఆర్‌వోలకు కష్టాలు.. మారుతున్న హోదాలు-4 ద్వారా ప్రత్యక్ష నియామకాలు చేపడుతున్నది. అయితే రోస్టర్ పాయింట్ల ద్వారా నోటిఫికేషన్ వెలువరించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోనే.. వీఆర్‌వోలను కేసీఆర్ పాలనలో రీడెప్లాయ్ చేశారు. కానీ సీనియారిటీ ప్రకారం అడ్జస్ట్ చేయలేదు. దీంతో వాళ్లు రికార్డుల్లో పేరుకే శాశ్వత ఉద్యోగులుగా మారారు. రెండేండ్లు గడిచినా నిబంధనల ప్రకారం తాత్కాలిక ఉద్యోగులుగానే చెలామణి అవుతూ సీనియారిటీని కోల్పోతున్నారు. నాడు రీడెప్లాయ్ చేసేటప్పుడు నోరు మెదపని జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులు.. నేడు ఆ పోస్టులు గ్రూప్ -4 ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ రూపంలో నోటిఫై చేసినవని కొర్రీలు పెడుతున్నారు.

పోస్టులు ఖాళీ చేయించాలని లేఖలు

పూర్వ వీఆర్‌వోలను రీడెప్లాయ్ చేసి రెండేళ్లు పూర్తయ్యాక.. నేడు ఆ పోస్టులు ఖాళీ చేయించాలని శాఖాధిపతులకు, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయిస్తునారు. నాడు తట్టని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు? ఇది ఒక్క వైద్య శాఖకే పరిమితమా? లేక మున్ముందు హోమ్, పంచాయతీ రాజ్, విద్యా శాఖ, న్యాయ, రవాణా, ఇతర సొసైటీలు, కార్పొరేషన్లకు వర్తిస్తుందా? అనే అంశం పూర్వ వీఆర్‌వోల్లో ఆందోళన కల్గిస్తున్నది. ఇప్పటికే అన్ని సర్వీస్ నిబంధనలు ఉల్లంఘనకు గురై తీవ్ర నష్టాల పాలైనా వీరి సమస్యలకు మోక్షం ఎప్పుడు? కొత్త ఆర్‌ఓఆర్- 2024 చట్టం ద్వారా వీరికి సైతం సత్వరమే పరిష్కారం చూపే అవకాశం ఉందా? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో రీడెప్లాయిడ్ వీఆర్‌వోలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

సర్వీస్ మ్యాటర్, ఉద్యోగ భద్రత మాటేమిటి ?

తాజాగా గ్రూప్ - 4 అభ్యర్థుల పేరుతో తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రీడెప్లాయ్ వీఆర్‌వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తమను ఏ ప్రాతిపదికన.. ఎక్కడ.. ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తమకు పోస్టులు లేక ఎగనిస్ట్ పోస్టుల్లో నియమించిన కలెక్టర్లు.. ఇప్పుడు ఎక్కడ నియమిస్తారని, తమ సర్వీస్ మ్యాటర్లు, ఉద్యోగ భద్రత ఏంటని ప్రశ్నిస్తున్నారు. ధరణి, ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటుతోనే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు.

కొన్నిచోట్ల రికార్డు అసిస్టెంట్లుగా..

కొన్ని చోట్ల నాల్గో తరగతి ఉద్యోగులకు పదోన్నతి ఇచ్చేందుకు పూర్వ వీఆర్వోలకు రికార్డు అసిస్టెంట్ హోదాకు మారుస్తున్నారు. సొసైటీలు (మైనార్టీ, మహాత్మా జ్యోతిబాఫూలే, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు)లో నియమితులైన వీఆర్వోలకు అక్కడ ఉన్న నిబంధనల మేరకు సీనియారిటీ ప్రకారం సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం వారిని తిరిగి రెవెన్యూలో సర్దుబాటు చేస్తారనే ప్రకటన నేపథ్యంలో వారికి పదోన్నతులు ఎందుకు? వెనక్కి వెళ్లండి.. అంటూ అండర్ టేకింగ్ ఇవ్వాలని కొర్రీలు పెడుతున్నారు. దీంతో సుమారు 70 మందికి అక్కడి నిబంధనల మేరకు పదోన్నతి ఆగిపోయింది. కొందరిని ఎగనిస్ట్ పోస్టుల్లో సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, వార్డెన్, తోటమాలి, డ్రైవర్ వంటి పోస్టుల్లో నియమించారు. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగానే వారితో నింపిన చాలా వరకు పోస్టులు గతంలో గ్రూప్ -4 పరీక్ష ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి నిర్దేశించినవే.

ఇటీవల సంబంధిత అభ్యర్థుల ఎంపిక పూర్తవగా వారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో చాలా శాఖల్లో ఖాళీలు లేవు. దీంతో అక్కడ ఉన్న పూర్వ వీఆర్వోలను వెంటనే ఆ పోస్టుల నుంచి రిలీవ్ చేయించి, వాటిని గ్రూప్ -4 సెలెక్టెడ్ అభ్యర్థులకు ఇవ్వాలని సంబంధిత శాఖాధిపతులు జిల్లా కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేస్తున్నారని సమాచారం. అలా వీలు కాని పక్షంలో సంబంధిత జిల్లా కలెక్టర్లకు వివరించి తాత్కాలిక ప్రాతిపదికన రీడెప్లాయిడ్ వీఆర్వోలను సర్దుబాటు చేసేలే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే మంచిర్యాల, పెద్దపల్లి, హన్మకొండ, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో 60 పోస్టులు గ్రూప్ -4 అభ్యర్థులకు కేటాయించాల్సి ఉంది. కానీ ఇప్పటికే అక్కడ 37 మంది వీఆర్వోలను నియమించారు. దీంతో వీరిని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇలాంటి పరిస్థితి సూర్యాపేట, మహబూబాబాద్, ఇతర అన్ని కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉంది.

ఇంకా ఎన్నెన్నో..

గ్రూప్ -4లో రెవెన్యూ శాఖ (భూ పరిపాలన, స్టాంప్స్, రిజిస్ట్రేషన్లు, లాండ్ రికార్డ్స్, వాణిజ్య పన్నులు)లో 1,200 పోస్టులుగా పేర్కొన్నారు. కానీ ఇప్పటికే రెవెన్యూలో ఖాళీలు లేక సుమారు 1600 మంది పూర్వ వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ ప్రాతిపదికన, రోస్టర్ పాయింట్లు లేకుండానే నియమించారు. ఈ నేపథ్యంలో నల్లగొండలో 54 పోస్టులను గ్రూప్ -4 ద్వారా నోటిఫై చేయగా.. ప్రస్తుతం నాలుగు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అలాగే చాలా శాఖల్లో అక్కడి మాతృ శాఖ సిబ్బంది పదోన్నతులకు పూర్వ వీఆర్వోల రీడెప్లాయిమెంట్ వల్ల తీవ్ర సీనియారిటీ సమస్యలు ఎదురవుతున్నాయి. రెవెన్యూ శాఖ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వీఆర్వోలను వెనక్కి తీసుకోవాలని టీఎన్జీవో నాయకులు పలు సందర్భాల్లో ప్రభుత్వానికి నివేదించారు. వారి సీనియారిటీ అంగీకరించమని హైకోర్టులో కేసులు వేసి సానుకూల తీర్పులు సైతం పొందారు. కొన్ని శాఖల్లో రీడెప్లాయిమెంట్ అంటే తాత్కాలిక ఉద్యోగులు అనే విధంగానే చూస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఒక వీఆర్వోకి మాత్రమే వేతనం ఇస్తున్నారు. వైద్య శాఖలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరెట్ (బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలు ఉంటాయి), వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం విభాగాలు ఉంటాయి. ఇప్పుడు లేవనెత్తిన సమస్య ఒక్క టీఎంఈ మాత్రమే. మున్ముందు వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం (పీహెచ్ఎసీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు)లో కూడా వస్తుంది. ఇలా టీజీపీఎస్సీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫై చేసిన ప్రతి పోస్టుకూ ఇదే సమస్య ఉంటుంది.

అంతా సోమేశ్ కుమార్ క్రెడిట్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ నియంతృత్వ ధోరణితో సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి తమను చెట్టుకొకరు పుట్టకొకరుగా విసిరేశారని పూర్వ వీఆర్‌వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిక్యూటిక్ విధులు నిర్వర్తించిన తాము గత ప్రభుత్వపు నిర్వాకం వల్ల తాత్కాలిక ఉద్యోగులుగా మారి ఉద్యోగ భద్రత, సామాజిక గుర్తింపు, నేరుగా ప్రజా సేవ చేసే అవకాశం కోల్పోయామని వారు ఆవేదన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకురానున్న రెవెన్యూ యాక్ట్ -2024లో భాగంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇప్పటికే చాలా నష్టపోయిన రీడెప్లాయ్ వీఆర్వోల విషయంలో ప్రభుత్వం ఏదైనా కమిటీని వేసి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News