TTD: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచంటే?

తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫార్సు లేఖల విషయంలో టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-03-17 10:16 GMT
TTD: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్..  ఎప్పటి నుంచంటే?
  • whatsapp icon

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుతో శ్రీవారి దర్శనాలు కల్పించడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. టీజీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో స్వామివారి దర్శనాన్ని ఈ నెల 24 నుంచి కల్పించనున్నట్లు ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారం ( సోమ, మంగళవారం దర్శనాలకు) మాత్రమే లేఖలు స్వీకరిస్తామని తెలిపింది. బుధవారం, గురువారం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు (ఏ రోజుకు ఆరోజే) లేఖలు అనుమతిస్తామని తెలిపింది. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖను అనుమతి ఇవ్వనున్నారు. సిఫార్సు లేఖపై ఆరుగురికి దర్శనం కల్పించనున్నారు. ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం (VIP break darshanam) కోసం ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుంచి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం (ఆదివారం దర్శనం కొరకు) స్వీకరించనున్నట్లు పేర్కొంది.

బీజేపీ ఎంపీ వ్యాఖ్యల అనంతరం

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై రెండు రోజుల క్రితం తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు, సౌకర్యాలు కల్పించాలని లేకుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ తిరుమల చేరుకుని టీటీడీ పాలకమండలితోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. రఘునందన్‌రావు ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే ఈ నెల 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సీఫార్సు లేఖలపై దర్శనం కల్పిస్తామని టీడీపీ ప్రకటించడం గమనార్హం.

Tags:    

Similar News