నిందితుల్లో ఐదుగురు మా ఉద్యోగులే.. నమ్మించి మోసం చేశారు : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి

Update: 2023-03-14 17:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీలో హ్యాకింగ్ జరిగి ప్రశ్న పత్రాలు లీక్ అయిన సర్వర్ లోనే ఇంకా అనేక ప్రశ్నపత్రాలు ఉన్నాయని, అందుకే వాటిని మళ్లీ తయారు చేయనున్నట్లు టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్ పీఎస్సీలో దాదాపుగా 2 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, ప్రతి ఏడాది సగటున 4వేలకు పైగా నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దాదాపుగా 23వేలకు పైగా నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 26 నోటిఫికేషన్లు ప్రకటించినట్లు తెలిపారు. అందుకే వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉందన్నారు.

ఇప్పటి వరకు ఏడేండ్లలో 30 వేలకు పైగా ఖాళీలు భర్తీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 175 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా జనార్దన్ రెడ్డి తెలిపారు. రాజశేఖర్ రెడ్డి అనే నెట్ వర్క్ ఎక్స్ పర్ట్ ఏడేండ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడని, అతడికి అన్ని ఐపీ అడ్రస్ లు తెలుసని ఆయన పేర్కొన్నారు. ఇతని ద్వారా హ్యాకింగ్ జరిగిందని విచారణలో తెలుసుకున్నట్లుగా చెప్పారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా లీక్ చేయించినట్లుగా నిర్ధారణకు వచ్చామన్నారు. కొందరి వ్యక్తులకు ఆ సమాచారాన్ని వీరు చేరవేశారని పేర్కొన్నారు. అయితే ఏఈ పరీక్షను రద్దు చేయాలా వద్దా అనే అంశంపై ఇప్పటి వరకు చర్చించామని, బుధవారం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో జరిగే వదంతులకు తావు ఇవ్వొద్దనే తాను క్లారిటీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ఏప్రిల్ లో ఇచ్చామని, అక్టోబర్ లో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. గ్రూప్ 1 విషయంలో మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా మల్టీ క్వషన్స్, ఆన్సర్ లో కూడా జంబ్లింగ్ విధానం అమలుచేశామని టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా తన కూతురు గ్రూప్ 1 పరీక్ష రాస్తానంటే తానే వద్దని చెప్పానని, రాయాలనుకుంటే తాను చైర్మన్ పదవిని వదులుకుంటానని చెప్పానని ఆయన గుర్తుచేశారు. చైర్మన్ పదవిని ఒక బాధ్యతగా స్వీకరించినట్లుగా చెప్పారు.

టీఎస్ పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులను కుటుంబసభ్యులుగా ట్రీట్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంటి దొంగలు కావడంతో నిందితలను గుర్తించడం ఇబ్బందిగా మారిందని, త్వరగా గుర్తించలేకపోయామని ఆయన చెప్పారు. గ్రూప్ 1 ఓఎంఆర్ షీట్లు తమ వెబ్ సైట్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. నిందితుడు ప్రవీణ్ కి 103 మార్కులు రావడం నిజమేనని, అయితే అవే టాప్ మార్క్స్ కావని తెలిపారు. ఇప్పుడే గ్రూప్ 1 గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన పేర్కరొన్నారు. సాక్షాల ఆధారంగానే నిర్ణయాలు ఉండాలని ఆయన వెల్లడించారు. లీకేజీ అంశంలో ఐదుగురు తమ సంస్థకు చెందిన ఉద్యోగులేనని ఆయన తెలిపారు. వారంతా నమ్మించి మోసం చేశారని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష యథావిధిగా కొనసాగిస్తామని జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా గురుకుల ప్రిన్సిపాల్ రిక్రూట్ మెంట్ ఇష్యూ కోర్టులో ఉందని, అందుకే పెండింగ్ లో ఉన్నట్లుగా చెప్పారు.

Tags:    

Similar News