నేరుగా రంగంలోకి కేసీఆర్.. వారిని ఎట్రాక్ట్ చేసేలా వ్యూహం!

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీల మధ్య పొలిటికల్ గేమ్ ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటున్నాయి.

Update: 2022-09-22 10:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీల మధ్య పొలిటికల్ గేమ్ ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల వైపు సీఎం కేసీఆర్ ఫోకస్ పెడుతుంటే బీజేపీ ఢిల్లీ జాతీయ నాయకత్వమంతా స్టేట్‌పై నజర్ వేసింది. ఈ క్రమంలో పార్టీలు తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువళ్లేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రత్యేక టీమ్‌లను నియమించుకుని పార్టీ విధివిధానాలు, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే వ్యూహరచణకు శ్రీకారం చుట్టాయి. సోషల్ మీడియా విషయంలో బీజేపీ మొదటి నుండి స్ట్రాంగ్‌గా ఉందనే టాక్ ఉండగా, ఈ విషయంలో మరింత దూకుడు అవసరం అని భావిస్తున్న టీఆర్ఎస్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇటీవల పార్టీ శ్రేణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఆసక్తిని రేపుతున్నది. ఈ క్రమంలో టీఆర్ఎస్ లీడర్ల స్పీచ్‌లకు, కార్యక్రమాలకు ఆదరణ తగ్గుతోందనే విషయాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా గుర్తించినట్లు చర్చ జరుగుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన పార్టీ సోషల్ మీడియాలో తమ పరపతిని పెంచుకునేందుకు నయా స్కెచ్ వేసినట్లు టాక్ వినిపిస్తోంది.

నేరుగా కేసీఆర్‌తో మాట్లాడించే ప్లాన్:

ప్రతిపక్షాల విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ సోషల్ మీడియా సపోర్ట్ తో పార్టీ శ్రేణులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో టీఆర్ఎస్ యువజన, విద్యార్థి సోషల్ మీడియా విభాగం కార్యకర్తలతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో పాటుగా టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ దినేశ్ చౌదరి, మరికొంత మంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతల స్పీచ్ లకు, కార్యక్రమాలకు తక్కువ లైకులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివిధ క్లిప్పింగ్ లను చూపిస్తూ వాటికి వచ్చిన లైకులు, షేర్లు ప్రదర్శించారు. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీ లీడర్ల స్పీచ్ ల ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో పాటుగా ఎక్కువగా లైకులు కొట్టాలని దినేష్ చౌదరి సూచించారు. అలాగే ఎవరైతే మంచి కామెంట్స్ పెడతారో అలాంటి వారితో నేరుగా ఫోన్ లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతారంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పెట్టే పోస్టులకు వెంటనే కౌంటర్లు ఇవ్వాలని దిశానిర్దేశం చేయడం ఆసక్తిగా మారింది.

యూత్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం:

రెండో దఫా అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యతిరేకత వస్తున్నది. ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్ తమ సోషల్ మీడియా విభాగాలను మరింత పటిష్టం చేయగా టీఆర్ఎస్ కు మాత్రం క్రమంగా ఆదరణ తగ్గుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల టీఆర్ఎస్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పుట్టగొడుగుల్లా ఆయా పేజీలు పుట్టుకువస్తున్నాయి. నిజానికి గతంలో కేసీఆర్ మాట్లాడుతుంటే వచ్చే వ్యూస్ ఈ మధ్య కాలంలో రావడం లేదనే చర్చ జరుగుతున్నది. మెజారిటీ యువత పార్టీకి దూరం అవుతుందనే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్.. ఈ గ్యాప్ ను పూడ్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ నేరుగా ఫోన్ లో మాట్లాడుతారనే ఎత్తుగడ వేసిందనే టాక్ వినిపిస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ కు తాజా వ్యూహం ఏ మేరకు గట్టెక్కిస్తుందో చూడాలి మరి.

Tags:    

Similar News