టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడే.. హైకోర్టులో ఆది శ్రీనివాస్ వాదనలు
దిశ, తెలంగాణ బ్యూరో: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషనర్ తరఫున వాడివేడి వాదనలు జరిగాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషనర్ తరఫున వాడివేడి వాదనలు జరిగాయి. ఆయన ఇప్పటికీ జర్మనీ పౌరుడేనని, భారత పౌరసత్వం లేదని, ఆయన వాడుతున్న పాస్‌పోర్టు సైతం ఆ దేశానిదేనని పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరఫున న్యాయవాది రవికిరణ్‌రావు వాదించారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, అటు న్యాయస్థానాన్ని, ఇటు ప్రజలను ఆయన మోసం చేస్తున్నారని జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని బెంచ్ ముందు వాదనలు వినిపించారు. రమేశ్ పౌరసత్వాన్ని రద్దుచేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
చట్టాలను ఉల్లంఘించేవారే చట్టాలు తయారుచేసేవారిగా ఉండరాదన్నారు. ఓటు వేసి ఎన్నుకున్న ప్రజలను కూడా రమేశ్ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తరచూ జర్మనీకి ఆయన చేసే ప్రయాణాలన్నీ ఆ దేశ పౌరసత్వంతోనేనని గుర్తుచేశారు. ఈ వాదనల మధ్యలో జోక్యం చేసుకున్న జస్టిస్ విజయసేన్ రెడ్డి, చెన్నమనేని రమేశ్‌కు అసలు వీసాలు ఉన్నాయా, ఎలా ప్రయాణిస్తున్నారు అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పిటిషనర్ తరఫున న్యాయవాది, జర్మనీలో రిటైర్డ్ ప్రొఫెసర్‌ని అని చెప్పుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, భారతీయ పౌరుడినని చెప్పుకుంటూనే జర్మనీ జారీ చేసిన పాస్‌పోర్టు మీద ప్రయాణం చేస్తున్నారని వివరించారు.
ఇండియాలోకి చెన్నమనేని రమేశ్ ఎంటర్ అయిన తేదీని కూడా కోర్టుకు సమర్పించిన నివేదికలో తప్పుగా పేర్కొన్నారని, తొలుత 2013 వరకు మాత్రమే ఆయనకు జర్మనీ పాస్‌పోర్టు ఉన్నా తిరిగి దాన్ని పదేళ్ళ పాటు 2023 వరకు రెన్యూవల్ చేసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పటికీ జర్మనీ పౌరసత్వాన్ని వదులుకోలేదని, 2019లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా దరఖాస్తులో ప్రస్తుత పౌరసత్వం అనే కాలమ్‌లో జర్మనీ అని, ప్రీవియస్ సిటిజన్‌షిప్ దగ్గర ఇండియా అని పేర్కొన్నారని వివరించారు. భారత పౌరసత్వం వచ్చిన తర్వాత జర్మనీ పాస్‌పోర్టును వదులుకుంటా అని చెప్పినా ఇప్పటివరకు వదులుకోలేదన్నారు.
భారతీయ పౌరుడు కాకుండానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, ఆయన పౌరసత్వంతో పాటు ఎన్నిక కూడా చెల్లదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న బెంచ్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.