జిల్లా స్థాయిలోనే బదిలీలు చేపట్టాలి.. మంత్రి పొంగులేటిని కోరిన ట్రెసా బృందం

నాయబ్ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లకు జిల్లా స్థాయిలోనే బదిలీలు చేపట్టాలని, ఇతర జిల్లాలకు కోరుకుంటే ఆప్షన్లు ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది.

Update: 2024-07-08 13:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నాయబ్ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లకు జిల్లా స్థాయిలోనే బదిలీలు చేపట్టాలని, ఇతర జిల్లాలకు కోరుకుంటే ఆప్షన్లు ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది. సోమవారం మంత్రిని ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి తదితరులు కలిశారు. బదిలీలపై నిషేధం ఎత్తివేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బదిలీలకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా జీవో నెం.80 ప్రకారం బదిలీలు కాబోతున్న నాయబ్ తహశీల్దార్లకు, సీనియర్ అసిస్టెంట్లకు జిల్లా స్థాయిలోనే బదిలీలు చేపట్టాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ కలిసి మంత్రితో చర్చించిన అంశాలను వివరించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి నాయబ్ తహశీల్దార్లను, సీనియర్ అసిస్టెంట్లను జిల్లా స్థాయిలోనే బదిలీలు చేపడతామని, జిల్లా మారాలంటే ఆప్షన్స్ ఇస్తామన్నారు. వాటికి త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు మిట్టల్ చెప్పారు. మరోవైపు తహశీల్దార్ల ఎన్నికల బదిలీలకు సంబంధించి సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎవరికి ఇబ్బందులు లేకుండా అందరికి న్యాయం చేస్తామని రెవెన్యూ మంత్రి హామీ ఇచ్చారు. పరస్పర బదిలీలకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు.


Similar News